సర్కారుకో దండం

Jan 6,2024 10:45 #Dharna, #muncipal workers
  • పొర్లు దండాలతో మున్సిపల్‌ కార్మికుల నిరసన

ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె 11వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం తక్షణమే తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం కార్మికులు వినూత్నంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ప్రభుత్వానికో దండం అంటూ పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలిపారు. జగన్‌కు మంచి బుద్దిని ప్రసాదించాలని వేడుకున్నారు. పలు చోట్ల భిక్షాటన చేశారు. ప్రభుత్వం కార్మికుల డిమాండ్ల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా పోటీ కార్మికులతో పనులు చేయిస్తోంది. వారిని అడ్డుకుంటున్న కార్మికులను అరెస్టులు చేయిస్తోంది. ప్రభుత్వం దిగొచ్చి తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకూ పోరాటం సాగిస్తామని మున్సిపల్‌ కార్మికులు తేల్చి చెప్పారు.

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో పోటీ కార్మికులతో చెత్తను తొలగించేందుకు మున్సిపల్‌ అధికారులు సిద్ధమవ్వగా సిఐటియు నాయకులు, మున్సిపల్‌ కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నామని, తమను ఇబ్బంది పెట్టొద్దంటూ కార్మికులు పోలీసుల కాళ్లు పట్టుకుని ప్రాధేయపడ్డారు. ఏలూరులోని వెహికల్‌ డిపో వద్ద వంటావార్పు నిర్వహిస్తుండగా ఇద్దరు సిఐల నేతృత్వంలో పోలీసులు ఒక్కసారిగా దాడి చేశారు. కార్మికులను బలవంతంగా తమ వాహనాల్లోకి ఎక్కించుకుని వెహికల్‌ డిపో గేట్లు తెరిచి పోటీ కార్మికులతో చెత్త వాహనాలను బయటకు తీశారు. కార్మికులు అడ్డుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు దౌర్జన్యంగా ఈడ్చుకెళ్లి వాహనంలో పడేశారు. ముఖ్య నాయకులను స్టేషనుకు తీసుకెళ్లారు. కార్మికుల అరెస్టులను యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సోమయ్య ఖండించారు. మున్సిపల్‌ కమిషనర్‌ బెదిరింపులతో పనులు చేయించడాన్ని నిరసిస్తూ శనివారం మున్సిపల్‌ ఆఫీసు ముట్టడి నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

గుంటూరు నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం వద్ద మున్సిపల్‌ కార్మికుల సమ్మె శిబిరాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సందర్శించి సంఘీభావం తెలిపారు. మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించని పక్షంలో రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో, పశ్చిమగోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెంలో పొర్లు దండాలు పెట్టి, కర్నూలులో క్లాప్‌ డ్రైవర్లు మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. గూడూరులో దున్నపోతుకు వినతి పత్రం అందజేశారు. అనంతపురంలో ఓ కార్మికుడు అరగుండు గీయించుకున్నారు. కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద కార్మికులు పొర్లు దండాలు పెట్టారు. విశాఖలోని మల్కాపురంలో చెత్త కుప్పల వద్ద బైఠాయించారు. మధురవాడలో ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. పిఎం.పాలెం, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో పొర్లు దండాలు పెట్టి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. బాపట్ల, ప్రకాశం జిల్లాలో వంటావార్పు చేపట్టారు. అనంతరం భిక్షాటన చేస్తూ సమ్మెకు ప్రజల మద్దతు కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. నెల్లూరులో పొర్లు దండాలు పెడుతూ జగన్‌కు మంచి బుద్ధిని ప్రసాదించాలని వేడుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ర్యాలీ, కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పొర్లు దండాలు పెట్టారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లాల్లో నిరసనలు కొనసాగాయి. శ్రీకాకుళంలో పొర్లు దండాలు పెడుతూ, ఆమదాలవలసలో ఉరి వేసుకుని, పలాసలో గాంధీ విగ్రహం వద్ద పడుకుని దండాలు పెడుతూ నిరసన తెలిపారు. విజయనగరం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట గడ్డితింటూ, రాజాంలో జగన్‌కు శతకోటి వందనాలు అంటూ కార్మికులు నిరసన తెలిపారు. నెల్లిమర్లలో పారిశుధ్య పనులు చేసేందుకు అధికారులు నియమించిన సిబ్బందిని సమ్మెలో ఉన్న కార్మికులు అడ్డుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, సాలూరు, పాలకొండలో పొర్లు దండాలు పెట్టారు. కడపలో గుండు కొట్టించుకుని, బద్వేలులో పొర్లు దండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. అన్నమయ్య, కృష్ణా జిల్లాల్లో నిరసనలు కొనసా గాయి. ఎన్‌టిఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో జల దీక్ష చేపట్టారు.

➡️