చర్చలు అసంపూర్ణం

municipal workers strike 3rd day

మున్సిపల్‌ సంఘాలతో 13 డిమాండ్లపై సుదీర్ఘ చర్చ

స్పష్టమైన హామీ కోసం నాయకుల పట్టుసమ్మె కొనసాగింపు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మున్సిపల్‌ కార్మికుల సమ్మె నేపథ్యంలో పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మున్సిపల్‌ కార్మిక సంఘాల నాయకులతో జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. రెండున్నర గంటలపాటు 13 అంశాలపై జరిగిన చర్చల్లో ప్రభుత్వం నుండి సానుకూల స్పందన లేకపోవడంతో సమ్మె కొనసాగిస్తామని నాయకులు ప్రకటించారు. గురువారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో జరిగిన చర్చలకు ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌(సిఐటియు), ఎఐటియుసి, టిఎన్‌టియుసి, ఐఎఫ్‌టియు, ఎంఆర్‌పిఎస్‌ సంఘాల తరుపున నాయకులు హాజరయ్యారు. ప్రభుత్వం నుండి మంత్రితోపాటు సిఅండ్‌డిఎంఏ పి.కోటేశ్వరరావు, ఆప్కాస్‌ ఎమ్‌డి వాసుదేవరావు, ఇతర అధికారులు పాల్గన్నారు. మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజనీరింగ్‌, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులకు సిఎం హామీ ఇచ్చిన విధంగా సమానపనికి సమానవేతనం, ఉద్యోగాల పర్మినెంటు, ఇంజనీరింగ్‌ కార్మికులకు హెల్త్‌ రిస్కు అలవెన్సు, క్లాప్‌ డ్రైవర్లకు రూ.18,500 జీతం తదితర డిమాండ్లపై చర్చించారు. సమావేశం అనంతరం సిఐటియు అనుబంధ సంఘ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, బి.సోమయ్య, ఉకుకూటి రాజు, ముత్యాలరావు, జ్యోతిబసు, సునీల్‌కుమార్‌, ఎఐసిటియు నాయకులు గొల్లపూడి ప్రసాదు తదితరులు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విధంగా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంటు చేయాలని కోరారు. ఆప్కాస్‌ (అవుట్‌సోర్సింగ్‌)లో 90 వేలమంది ఉన్నారని, వారికీ పనికి తగిన సమానవేతనం ఇవ్వాలని కోరగా వారికి చేయడం సాధ్యం కాదని మంత్రి తెలిపారని, దీనికి అభ్యంతరం తెలిపామని పేర్కొన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 8,9 పిఆర్‌సిలకు సంబంధించి బేసిక్‌పే రూ.3,900, రూ.6,700 అమలు జరిగిందని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ మేరకు 11వ పిఆర్‌సి బేసిక్‌పే రూ.20 వేలు అమలు చేయాలని, ఆప్కాస్‌ నిబంధనల్లో పేర్కొన్న విధంగా ఉద్యోగులుగా గుర్తించి జీతాలు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలిపారు. కొన్ని అంశాలపై మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించాలని మంత్రి తెలపగా నాలుగున్నరేళ్లుగా కార్మికులు ఎదురు చూస్తున్నారని, ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ సమస్యను పరిష్కరించకుండా సమ్మెను విరమించేది లేదని నాయకత్వం మంత్రికి స్పష్టం చేసింది. 13 డిమాండ్లలో మూడు డిమాండ్లకు ప్రభుత్వం నుండి సానుకూలత వ్యక్తమైందని పేర్కొన్నారు. చెత్త తరలించే వాహన డ్రైవర్లు, యుజిడి, మలేరియా, పార్కులలో పనిచేసే కార్మికులకు హెల్త్‌ అలవెన్స్‌ చెల్లించేందుకు సిద్దపడ్డారని, అలాగే జిఓ 30లో అన్యాయం జరిగిన మంచినీటి సరఫరా, వర్కు ఇన్‌స్పెక్టర్లు, యుజిడి, చైన్‌దళం, డ్రైవర్లు ఇతర విభాగాలకు చెందిన కార్మికులకు కార్మికశాఖ ప్రతిపాదనల మేరకు జీతాలు చెల్లించేందుకు సానుకూలత వ్యక్తం చేశారని తెలిపారు. అలాగే రాజధాని ప్రాంతంతో సహా విలీన గ్రామాలకు చెందిన పంచాతీయ కార్మికులకు మున్సిపల్‌ కార్మికులకు చెల్లిస్తున్న విధంగా జీతాలు చెల్లింపునకు ఆమోదం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. అయితే వాటికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే నమ్మకం కుదురుతుందని పేర్కొన్నారు. వాహనాల్లో లైట్‌, హెవీ డ్రైవర్లకు ఒకే పద్ధతిలో జీతంచెల్లించే అంశంపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీనిచ్చారని వివరించారు. హెల్త్‌ అలవెన్స్‌ చెల్లింపు సందర్భంగా సెలవు దినాలకు కోతలు విధించడం మానుకోవాలని కోరామని, దీనిపై మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారని వివరించారు. ఇంజనీరింగ్‌ విభాగం కార్మికులకు సంబంధించిన చర్చ జరిగినప్పటికీ మంత్రి వైపు నుండి సానుకూలత రాలేదని వివరించారు. మంత్రి సమ్మెను వాయిదా వేసుకోవాలని పలుమార్లు కోరారని, అయినా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేవరకూ ఆందోళన విరమించేది లేదని తేల్చిచెప్పినట్లు తెలిపారు. సమ్మె యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి ఆదిమూలపుమున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని పట్టణాభివృద్దిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కార్మిక సంఘాల నాయకులను అడిగి సమస్యలు తెలుసుకున్నామని పేర్కొన్నారు. కొన్ని అంశాలపై గుంటూరు, విజయవాడ, మార్కాపురం కమిషనర్లతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించామని పేర్కొన్నారు. హెల్త్‌ అలవెన్సులపై గుంటూరు కమిషనర్‌తో మాట్లాడి పరిష్కరించామని వివరించారు. ఆప్కాస్‌ ద్వారా ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు.

రాజాంలో 3వ రోజు సమ్మెలో చెవిలో పువ్వులతో మున్సిపల్ కార్మికుల నిరసన
మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న దృశ్యం సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ నగర్ కార్యదర్శి ఆర్ వి నాయుడు తదితరులు
మన్యం జిల్లాలో మున్సిపల్ కార్మికుల నిరసన

municipal workers strike 3rd day gnt

మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సంఘీభావం తెలిపిన సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి కన్నా లక్ష్మీనారాయణ.

గుంటూరు జిల్లా – సత్తెనపల్లి రూరల్:

సత్తెనపల్లి మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి పారిశుద్ధ్య కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈసందర్భంగా కన్నా మాట్లాడుతూ కార్మికుల పట్ల జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డుతున్నారని విమర్శించారు. తక్షణం మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షురాలు చంద్రకళ, సిఐటీయు మండల కార్యదర్శి పెండ్యాల మహేష్, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

 

ఏలూరు జిల్లా : కనీస వేతనం 18,500 ఇవ్వాలని డిమాండ్ చేస్తూ క్లాప్ డ్రైవర్లు చేపట్టిన రెండవ రోజు సమ్మెలో భాగంగా పంపులు చెరువు వద్ద ఉన్న వెహికల్ డిపో వద్ద ధర్నా చేస్తున్న క్లాప్ డ్రైవర్లు. పోలీసుల మద్దతుతో, వేరే డ్రైవర్లతో వాహనాలు తీసేందుకు ప్రయత్నించిన కమిషనర్…. డ్రైవర్లకు కమిషనర్ కు మధ్య వాగ్వాదం…

municipal workers strike 3rd day eluru

ఏలూరు జిల్లా : మున్సిపల్ కార్మికుల సమ్మెలో భాగంగా మూడో రోజు సమ్మె శిబిరాన్ని సందర్శించి మాట్లాడుతున్న సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ. రవి.

గుంటూరు జిల్లా  నరసరావుపేటలో 3వ రోజు కొనసాగుతున్న మునిసిపల్ కార్మికుల నిరసన సమ్మె.

municipal workers strike 3rd day konaseema

  • చెవిలో పువ్వులతో కార్మికులు వినూత్నంగా నిరసన

కోనసీమ – మండపేట : సమస్యల పరిష్కారం కోరుతూ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ కాంట్రాక్టు పారిశుధ్య కార్మికులు చేపట్టిన సమ్మె బుధవారం నాటికి చేరుకుంది.  ఈ సందర్భంగా కార్మికులు చెవిలో పువ్వులు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం పలువురు కార్మిక నాయకులు మాట్లాడుతూ కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని, సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పిఎఫ్ ఈ ఎస్ ఐ, పింఛన్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో కార్మికులు బంగారు కొండ, కొమారపు నరేంద్ర కుమార్, లోవరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

➡️