నేటి నుంచి నంది నాటకోత్సవాలు

  • గుంటూరు విజ్జాన మందిరంలో ఏర్పాట్లు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : రాష్ట్ర స్థాయి నంది నాటకోత్సవాలు శనివారం నుంచి గుంటూరులోని శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వారం పాటు జరగనున్నాయి. 73 అవార్డుల కోసం 38 నాటక సమాజాలు 1200 మంది నటీనటులు పోటీపడనున్నారు. ఈ ఉత్సవాలను మంత్రి చెన్నుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రారంభించనున్నారు. నాటక ప్రదర్శనలు పరిశీలించి వాటికి స్వర్ణ, రజత, కాంస్య నందుల విజేతలను ఎంపిక చేయడానికి 15 మంది న్యాయ నిర్ణేతలు హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11 గం. ‘శ్రీ కాళహస్తీశ్వర మహత్యం’ (పద్య నాటకం), మధ్యాహ్నం 2.30కు ‘ఎర్ర కలువ’, సాయంత్రం ఐదుగంటలకు ‘నాన్నా… నేనొచ్చేస్తా…’, 6 .30కు శ్రీ రామ భక్త తులసీ దాసు (పద్య నాటకం) ప్రదర్శించనున్నారు. కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి.విజరు కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లు జరగనున్నాయి. నంది నాటకోత్సవాల సందర్భంగా గుంటూరు కలెక్టరేట్‌లో ఎన్‌టిఆర్‌ రంగస్థల పురస్కారం, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ రంగస్థల పురస్కారానికి విజేతల ఎంపిక కోసం మొత్తం 27 మంది న్యాయనిర్ణేతలు సమావేశమై విజేతలను ఎంపిక చేశారు. ఎన్‌టిఆర్‌ రంగస్థల అవార్డు 2022 సంవత్సరానికి డా. మీగడ రామలింగ స్వామిని, డా. వైఎస్‌ఆర్‌ అవార్డు 2023 సంవత్సరానికి కాకినాడ యంగ్‌ మెన్స్‌ హ్యపీ క్లబ్‌ ఎంపిక అయినట్టు ఫిలిం డెవలప్‌మెం ట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పోసాని కృష్ణమురళి శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు.

➡️