ప్రశాంతంగా ముగిసిన నీట్‌ – 2024 పరీక్షలు

May 6,2024 08:48 #neat exam
  • 557 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
  •  మధ్యాహ్నం 2 నుంచి 5.20వరకు కొనసాగిన పరీక్ష
  •  24 లక్షల మందికి పైగా దరఖాస్తులు

ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో : దేశ వ్యాప్తంగా మెడికల్‌ ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎల్జిబులిటీ కమ్‌ ఎంట్రైన్స్‌ టెస్ట్‌(నీట్‌- 2024) ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. పరీక్షను నేషనల్‌ ఏజెన్సీ (ఎన్‌టిఎ) నిర్వహించింది. కెమిస్ట్రీకి సంబంధించిన ప్రశ్నలు కొంచెం కష్టంగా వచ్చినట్టు పరీక్షకు హాజరైన విద్యార్థులు వాపోయారు. బోటనీ, జువాలజీ, ఫిజిక్స్‌ ప్రశ్నలు సాధారణంగా ఉన్నాయని చెప్పారు.అయితే ఒకటీ రెండు ప్రశ్నలు అవుటాప్‌ సబ్జెక్ట్‌ నుంచి వచ్చినట్టు విద్యార్థులు భావిస్తున్నందున వాటిపై ఎన్‌టిఎ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. భారత దేశంతో పాటు ఇతర దేశాల్లో నీట్‌ పరీక్షను నిర్వహించారు. పరీక్షను మధ్యాహ్న 2గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు నిర్వహించారు. నీట్‌ పరీక్ష కోసం 24 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్టు ఎన్‌టిఎ వెల్లడించింది. దేశంలో 557 నగరాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా ఇతర దేశాల్లోని 14నగరాల్లోనూ నీట్‌ పరీక్షను నిర్వహించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో నీట్‌ పరీక్షను రాశారు. తెలంగాణలో సుమారు 74 వేల మంది దరఖాస్తు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం. నిమిషం ఆలస్యం నిబంధనను అమలు చేశారు .మూడు గంటల ముందు నుంచే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించారు. సాధారణ దుస్తులతోనే పరీక్షకు అనుమతించిన నిర్వాహకులు, మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోకి అనుమతించలేదు. ఇదిలా ఉండగా ఉదయం తొమ్మిది గంటలకే రిపోర్టింగ్‌ చేయాలని పేర్కొన్న ఎన్‌టిఎ, స్నాక్స్‌ కూడా ఇవ్వక పోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

➡️