తోటపల్లి, రామతీర్థ సాగర్‌పై నిర్లక్ష్యం

Apr 30,2024 08:54 #Neglect, #Ramatirtha Sagar, #Thotapalli

-అరకొరగా నిధులు కేటాయించిన వైసిపి, టిడిపి ప్రభుత్వాలు
-నేటికీ పెండింగ్‌లోనే పనులు
ప్రజాశక్తి-విజయనగరం ప్రతినిధి :ఎన్నికల పోలింగ్‌ తేదీ దగ్గరపడుతుండడంతో విజయనగరం జిల్లాను ప్రభావితం చేసే వ్యవసాయం, సాగునీటి రంగాలను తామే ఉద్దరించామంటూ టిడిపి, వైసిపి నేతలు ఎవరికివారే గొప్పలు చెప్పుకుంటున్నారు. వాస్తవాలను గమనిస్తే ఈ రెండు ప్రభుత్వాల కన్నా కాంగ్రెస్సే నయం. జిల్లాలో అత్యంత కీలకమైన తోటపల్లి, రామతీర్థసాగర్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిందీ, వాటికి అత్యధిక నిధులు కేటాయించిందీ 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీయే. ఆ తరువాత 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టిడిపి నిధుల కేటాయింపులో రెండో స్థానంలోనే ఉండిపోయింది. గడిచిన ఐదేళ్లలో వైసిపి ప్రభుత్వం నిధుల కేటాయింపు నామమాత్రంగా చేసింది. దీంతో, ఆయకట్టుదారులకు రెండు దశాబ్ధాలుగా సాగునీటి కోసం ఎదురుచూపులు తప్పలేదు. నిర్వాసితులకు నేటికీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. ప్రస్తుత అధికార, ప్రతిపక్ష పార్టీలు సాగునీటి ప్రాజెక్టులను కేవలం ఎన్నికల హామీలుగా ఉపయోగించుకోవడం తప్ప చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడంతో తోటపల్లి లక్ష్యానికి అనుగుణంగా సాగు నీరు అందడం లేదు. రామతీర్థసాగర్‌ పనులు నేటికీ పూర్తి కాలేదు.
64 వేల ఎకరాల పాత ఆయకట్టును స్థిరీకరిస్తూనే కుడి కాలువ ద్వారా అదనంగా 1,31,221 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో రూ.450 కోట్ల అంచనా వ్యయంతో తోటపల్లి సాగునీటి ప్రాజెక్టును 2004లో చేపట్టారు. ఇప్పటి వరకు రూ.940.12 కోట్లు ఖర్చు అయింది. 2004 నుంచి 2014 వరకు అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం మాత్రమే అత్యధికంగా రూ.582.21 కోట్లు ఖర్చు చేసింది. 2014-19లో అప్పటి టిడిపి ప్రభుత్వం రూ.285.47 కోట్లు వెచ్చించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసిపి మరింత రూ.72 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. అయితే, తోటపల్లి ప్రాజెక్టును తామే నిర్మించామంటూ టిడిపి, వైసిపి గొప్పలు చెప్పుకుంటున్నాయి. సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం వల్ల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో, ఏటేటా అంచనా వ్యయం పెరిగిపోయింది. ఇటీవల వచ్చిన చంద్రబాబు తన వల్లే ఈ ప్రాజెక్టు ఇంత వరకు వచ్చిందని చెప్పుకున్నారు. లేదు… లేదు వైసిపియే మొత్తం పూర్తి చేసిందన్నట్టుగా ఆ పార్టీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. తగినంతగా విడుదల చేయకపోవడంతో కాంట్రాక్టర్‌ తరచూ పనులు నిలిపివేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాలువపై అనేక చోట్ల స్ట్రక్చర్లు, పిల్ల కాలవల నిర్మాణాలు, భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస చర్యలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
24 వేల ఎకరాలకు సాగు నీరు, విజయనగరం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు తాగునీటి సదుపాయం కల్పించే లక్ష్యంతో 2005లో తలపెట్టిన తారకరామతీర్థ సాగర్‌ ప్రాజెక్టు పట్ల కూడా వైసిపి, టిడిపి నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. ఇప్పటి వరకు 310.08 కోట్లు ఖర్చు కాగా, వైసిపి ప్రభుత్వం రూ.86.2 కోట్లు మాత్రమే ఇచ్చింది. 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం రూ.103.58 కోట్లు ఖర్చు చేసింది. అంతకుముందు 2004ా2009లో 57.85 కోట్లు, 2009ా2014లో రూ.62.45 కోట్లు చొప్పున ఆ పదేళ్లలోని వైఎస్‌ఆర్‌, రోశయ్య, కిరణ్‌ కుమారెడ్డి నాయకత్వంలో ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వాలు విడుదల చేశాయి. ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులపై టిడిపికి, వైసిపికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో స్పష్టమవుతోంది.

➡️