టిడిపి నేతల నిర్వేదం

Mar 26,2024 00:11 #candidates, #TDP
  •  పొత్తులో భాగంగా సీటు కోల్పోయామని ఆవేదన
  •  కంట తడిపెట్టిన సుగుణమ్మ

ప్రజాశక్తి – యంత్రాంగం : బిజెపి, టిడిపి, జనసేన పొత్తులో భాగంగా సీట్లు కోల్పోయిన పలువురు నేతలు అసంతృప్తితో ఉన్నారు. బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో తమకు సీటు కేటాయించలేదని టిడిపి అధినేతపై బహిరంగానే నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. గట్టిపట్టున్న స్థానంలో కూడా బిజెపి, జనసేనకు సీటు కేటాయించడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నేతలకు టికెట్లు కేటాయించకుండా రాజీనామాలకు సైతం వెనకాడబోమని టిడిపి ద్వితీయ శ్రేణి నాయకులు హెచ్చరిస్తున్నారు.
తిరుపతి మాజీ ఎమ్మెల్యే ఎం.సుగుణమ్మ పట్టు వదలకుండా ‘టికెట్‌’ కోసం అభ్యర్ధిస్తూనే ఉన్నారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాస్‌ కాకుండా, స్థానిక అభ్యర్థికి టికెట్‌ ఇస్తే తమకు ఏమాత్రమూ అభ్యంతరం లేదన్నారు. తిరుపతి అభ్యర్థి విషయంలో ఎన్నో సర్వేలు చేశారని, ఆ సర్వేల్లో తనకే ఎక్కువ అనుకూలంగా ఓట్లు వచ్చాయన్నారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటును జనసేన ఇన్‌ఛార్జి పోతిన వెంకట మహేష్‌కు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం నిరవధిక దీక్షలు ప్రారంభించారు. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో వెంకట మహేష్‌తోపాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు దీక్షలు చేపట్టారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ టికెట్‌ను మాజీ డిప్యూటీ స్పీకర్‌ మండలి బుద్ధప్రసాద్‌కు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు డిమాండ్‌ చేశారు. బుద్ధప్రసాద్‌కు టికెట్‌ ఇవ్వకపోతే పార్టీకి రాజీనామా చేస్తామని నాయకులు హెచ్చరించారు. కాకినాడ సిటీ సీటును ఆశించిన మాజీ మేయర్‌, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.సరోజ ఆదివారం రాజీనామా చేశారు. తనకు సీటు కేటాయిస్తానని చెప్పి పవన్‌కల్యాణ్‌ మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనుచరులు, కార్యకర్తల అభీయిష్టం మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. జగ్గంపేట నియోజకవర్గంలో సీటు దక్కకపోవడంతో జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి పాటంశెట్టి సూర్యచంద్ర తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. స్వతంత్రంగా బరిలో దిగుతానని తెలిపారు. ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో తన భార్యతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. అనపర్తిలో నియోజకవర్గం సీటు బిజెపికి కేటాయిస్తారనే వార్తలతో టిడిపి కేడర్‌లో అసంతృప్తి నెలకొంది. ఈ టికెట్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆశిస్తున్నారు. ఈ సీటును బిజెపికి కేటాయిస్తే ఆయన టిడిపి నుంచి దూరమవుతారని టిడిపి ద్వితీయశ్రేణి నాయకులు చెబుతున్నారు.

➡️