వాగ్దానాలు కాదు..నిధులు, ఉత్తర్వులు ఇవ్వండి

Feb 5,2024 11:34 #airtwf

మోడీకి ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి

న్యూఢిల్లీ : ఈ నెల 2న ‘భారత్‌ మొబలిటీ సమ్మిట్‌’ను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను అఖిల భారత రోడ్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌) స్వాగతించింది. అయితే కేవలం వాగ్దానాలు మాత్రమే కాదని, నిధులు, ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్‌. లక్ష్మయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 2న మోడీ మాట్లాడుతూ ‘జాతీయ రహదారుల వెంబడి ట్రక్కులు, ట్యాక్సీ డ్రైవర్లు కోసం అన్ని సౌకర్యాలతో వెయ్యి భవనాలను మా ప్రభుత్వం నిర్మించనుంది’ అని తెలిపారు. డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంబడి అన్ని సౌకర్యాలతో భవనాలు నిర్మించాలని తాము సుదీర్ఘకాలం నుంచి డిమాండ్‌ చేస్తున్నట్లు గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన పదేళ్ల తరువాతయినా ప్రధానమంత్రి మోడీ ఈ డిమాండ్‌ను గుర్తించినందుకు హార్షం వ్యక్తం చేశారు. ఈ నిర్మాణాల కోసం ప్రస్తుత బడ్జెట్‌లోనే నిధులు కేటాయించాలని, ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. నేషనల్‌ పర్మిట్‌ వాహనాల్లో ఇద్దరు డ్రైవర్లను నియమించడం అనే నిబంధనను తప్పనిసరి చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వం ఈ నిబంధనను సడలించిందని, ఒక డ్రైవర్‌తో పనిచేయడానికి అనుమతించిందని తెలిపారు. ఇది డ్రైవర్లపై అపరిమిత పని గంటలను సృష్టించిందని, డ్రైవర్లపై ఒత్తిడి పెంచిందని విమర్శించారు. ఈ సడలింపుతో జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువయ్యాయని తెలిపారు. కాబట్టి నేషనల్‌ పర్మిట్‌పై ఇద్దరు డ్రైవర్లు నిబంధనను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జాతీయ రహదారుల నిర్మాణాల్లో లెక్కలేనన్ని ఉల్లంఘనలు జరుగుతున్నాయని, ఇది ప్రమాదాలకు కారణమవుతోందని గుర్తు చేసింది. ఇలాంటి లోపాలను సరిదిద్దాలని, నిబంధనలను ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్‌ లిస్టు చేయాలని ఎన్నిసార్లు డిమాండ్‌ చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించింది. ఇలాంటి వైఫల్యాలను పక్కపెట్టి డ్రైవర్లను శిక్షించడం తగదని తెలిపింది. ప్రస్తుత బడ్జెట్‌ సమావేశాల్లోనే భారతీయ న్యాయ సంహిత 106 (1) (2)కు సవరణ చేసి, డ్రైవర్లకు శిక్షలను పెంచే నిబంధనను ఉపసంహరించుకోవాలని ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

➡️