18న శ్రీవారి ఆగస్టు నెల కోటా విడుదల

ప్రజాశక్తి -తిరుమల :ఆగస్టు మాసంలో శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్ల కోటా షెడ్యూల్‌ను టిటిడి విడుదల చేసింది. మే 18న ఉదయం పది గంటలకు శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్లను ఎలక్ట్రానిక్‌ డిప్‌ కోసం మే 20న ఉదయం పది గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఈ టికెట్లు పొందిన వారు మే 20 నుంచి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు జారీ అవుతాయని పేర్కొంది. శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17 వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. సేవా టికెట్లు, వర్చువల్‌ సేవలు, దర్శన స్లాట్లకు సంబంధించిన ఆగస్టు నెల కోటా మే 21న అందుబాటులోకి రానుంది. ఆగస్టు నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను మే 23న, శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన ఆగస్టు నెల ఆన్‌లైన్‌ కోటాను మే 23వ తేదీ ఉదయం 11 గంటలకు విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఆగస్టు నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను మే 23న విడుదల చేయనుంది. ఆగస్టు నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను మే 24న ఉదయం పది గంటలకు, తిరుమల, తిరుపతిలలో ఆగస్టు నెల గదుల కోటాను మే 24న మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్‌లైన్‌లో, మే 27న తిరుమల – తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ టికెట్లను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
టిటిడి పాఠశాలలో పలు కోర్సులకు నోటిఫికేషన్‌
టిటిడి ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంగీత, నృత్య కళాశాల, ఎస్‌వి నాదస్వరం, డోలు పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పలు రెగ్యులర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ టిటిడి ప్రకటన విడుదల చేసింది. మే 25 నుంచి కళాశాలలో దరఖాస్తులు జారీ చేస్తారు. జూన్‌ 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

➡️