అంగన్‌వాడీ సెంటర్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలి

స్త్రీ, శిశు సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి లేఖ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఎండల తీవ్రత వల్ల అంగన్‌వాడీ సెంటర్లకు వస్తున్న ప్రీ స్కూలు పిల్లలు, గర్భిణులు, బాలింతలు, అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) పేర్కొంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ సెంటర్లలో ఒంటిపూట బడులు నిర్వహించాలని స్త్రీ, శిశుసంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీకి యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి బేబీరాణి, కె సుబ్బరావమ్మ బుధవారం లేఖ రాశారు. మినీ వర్కర్లకు వేసవి సెలవులివ్వాలని, సమ్మె ఒప్పందంలో అంగీకరించిన మినీ సెంటర్లను మెయిన్‌ సెంటర్లుగా మారుస్తూ, మట్టి ఖర్చులకు సంబంధించిన జిఓలు ఇవ్వాలని లేఖలో ప్రభుత్వాన్ని కోరారు. సర్వీసులో ఉండి మరణించిన అంగన్‌వాడీలకు మట్టి ఖర్చులు, బీమా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగానికి సంబంధించి జిఓ ఇవ్వాలని, అదే విధంగా జిఓ నెంబరు 47ను మార్పు చేయాలని కోరారు. అంగన్‌వాడీలకు రిటైర్‌మెంటు బెనిఫిట్‌ కింద మొదటి వర్కర్‌కు రూ.50 వేల నుంచి రూ.లక్షకు, హెల్పర్‌కు రూ.20 వేల నుంచి రూ.40 వేలకు పెంచుతూ జిఓ నెంబరు 47 ఇచ్చారని, అయితే దీనిని మార్పు చేస్తూ మినిట్స్‌ కాపీలో అంగీకరించిన విధంగా వర్కర్‌కు రూ.1.20 లక్షలు, హెల్పర్‌కు రూ.60 వేలు ఇచ్చే విధంగా జిఓను మార్పు చేయాలని కోరారు. అంగన్‌వాడీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం విడుదల చేసిన జిఓ నెంబరు 10ని మార్పు చేస్తూ ప్రతి జోన్‌ నుంచి ఒక వర్కర్‌, ఒక హెల్పర్‌, మినీ వర్కర్‌ను కమిటీలోకి తీసుకోవాలని యూనియన్‌ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

➡️