ప్రజలకు పవన్‌ కృతజ్ఞతలు

May 16,2024 22:27 #JanaSena, #pavan kalyan

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు చూపించిన ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సుస్థిర ప్రభుత్వం, సంక్షేమం, అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వాములు అయినందుకు అభినందనలు తెలియజేశారు. ‘అత్యధికంగా 81.86 శాతం ఓటర్లు రాజ్యాంగం కల్పించిన హక్కును వినియోగించుకోవడం చాలా ఆనందాన్ని కలిగించింది. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అలాగే ఎన్నికల ప్రాముఖ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడంలో మీడియా, పౌరసంఘాల వారు పోషించిన బాధ్యతాయుత పాత్రకు ధన్యవాదాలు’ అని ఆయన పేర్కొన్నారు. కాగా, పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు, టిడిపి ఇన్‌ఛార్జి ఎస్‌విఎస్‌ఎన్‌ వర్మకు కూడా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

➡️