రైతు ఉద్యమం మరింత విస్తరించాలి

– ఉధృతంగా స్వతంత్ర, సంయుక్త పోరాటాలు

– ఎఐకెఎస్‌ అధ్యక్షులు అశోక్‌ ధావలే పిలుపు

– కర్నూలులో ఉత్తేజంగా ప్రారంభమైన ఆలిండియా కిసాన్‌ సభ కౌన్సిల్‌ సమావేశాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధిా ఎన్‌ శంకరయ్యనగర్‌. కర్నూలుదేశంలో రైతు ఉద్యమం మరింతగా విస్తరించాలని అఖిలభారత కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) అధ్యక్షులు అశోక్‌ ధావలే అన్నారు. రైతు సమస్యలపై సంఘం స్వతంత్ర, సంయుక్త ఉద్యమాలు ఉధృతం కావాలని పిలుపునిచ్చారు. బలమైన సంఘ నిర్మాణ లక్ష్యంతో పని చేయాలని కోరారు. పోరాటాల్లో కలిసొచ్చే రైతులను రాజకీయంగా మన వైపు మరల్చుకునేందుకు సమర్ధవంతమైన ప్రచారం నిర్వహించాలని, వారిలో చైతన్యం కలిగించాలని ఉద్బోధించారు. 15 నుంచి మూడు రోజులపాటు ఇక్కడ జరిగే ఎఐకెఎస్‌ ఆలిండియా కౌన్సిల్‌ (ఎఐకెసి) సమావేశాలు శుక్రవారం ఉత్తేజభరితంగా ప్రారంభమయ్యాయి. సమావేశాలు నిర్వహిస్తున్న సత్య ఇన్‌ రెసిడెన్సీ ప్రాంగణానికి ఇటీవల మరణించిన ఎఐకెఎస్‌ మాజీ నాయకులు, తమిళనాడు వామపక్ష ఉద్యమ సీనియర్‌ నేత ఎన్‌ శంకరయ్య నగర్‌ పేరు పెట్టారు. అశోక్‌ ధావలే సంఘ పతాకావిష్కరణతో కౌన్సిల్‌ సమావేశాలు మొదలయ్యాయి. అనంతరం ధావలే అధ్యక్షోపన్యాసం చేశారు. కేరళ త్రిసూర్‌లో ఎఐకెఎస్‌ ఆలిండియా కాన్ఫరెన్స్‌ తర్వాత ఏడాదికి కౌన్సిల్‌ భేటీ కర్నూలులో జరుగుతోందన్నారు. ఈ కాలంలో రైతు ఉద్యమంలో పలు చారిత్రాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయని వివరించారు. ‘ఏప్రిల్‌ 5న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో రైతులు, కార్మికుల సంయుక్త ర్యాలీ, ఆగస్టు 24న ఢిల్లీలో రైతు, కార్మిక మహా సమ్మేళనం, నవంబర్‌ 26-28 తేదీల్లో అన్ని రాష్ట్ర కేంద్రాల్లో కార్మిక-కర్షక మహా ధర్నాలు రైతు ఉద్యమానికి ముఖ్యమైన మైలు రాళ్లు’గా చెప్పారు. తమిళనాడులో 1992 నుంచి 31 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా నాడు వాచాతిలో గిరిజనులపై పాశవిక దాడికి కారకులైన ప్రభుత్వ యంత్రాంగానికి మద్రాస్‌ హైకోర్టు శిక్షలు వేసిందని, ఈ పరిణామం న్యాయం కోసం వామపక్ష, ప్రజాసంఘాల, అణగారిన వర్గాల పోరాట చారిత్రక విజయంగా అభివర్ణించారు. అంతర్జాతీయంగా చూస్తే సామ్రాజ్యవాద దాష్టీకాలు పెరిగాయని ధావలే చెప్పారు. పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న నరమేధంలో రెండు నెలల్లో 20 వేల మంది చనిపోయారు. వారిలో సగం మంది పిల్లలు, మహిళలుండటం విషాదకరం. అమెరికా, ఇతర పశ్చిమదేశాల మద్దతుతోనే పాలస్తీనాపై ఇజ్రాయిల్‌ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయిల్‌ ఏర్పడ్డాక ఇన్ని దశాబ్దాల్లో భారత్‌ పాలస్తీనా వైపు నిలబడింది. ప్రస్తుత మోడీ ప్రభుత్వం అమెరికా ప్రాపకం కోసం ఇజ్రాయల్‌కు మద్దతిస్తూ తటస్తంగా ఉన్నానంటోంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడు చోట్ల బిజెపి గెలవడం ఆందోళనకరమని ధావలే అన్నారు. ‘ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపి ఒక పథకం ప్రకారం హిందూత్వ ఓట్లను ఏకీకరణ చేశాయి. కులాలవారీగా సోషల్‌ ఇంజనీరింగ్‌కు పాల్పడ్డాయి. కాంగ్రెస్‌ ఒంటెత్తు పోకడ, ఫలితంగా ప్రతిపక్షాల మధ్య అనైక్యత. ఓట్ల తొలగింపుల వంటి బిజెపి అధికారిక రిగ్గింగ్‌, మనీ-మీడియా పవర్‌, బిజెపి గెలుపునకు కారణం. మిజోరంలో సుదీర్ఘంగా ఎన్‌డిఎలో ఉన్న ఎంఎన్‌ఎఫ్‌ ఓటమి, తెలంగాణలో కాంగ్రెస్‌ గెలుపు సంభవించాయి’ అని విశ్లేషించారు. రాజస్థాన్‌లో రైతు ఉద్యమ ఫలితంగా సిపిఎం అభ్యర్ధులు చాలా చోట్ల గణనీయమైన ఓట్లు సాధించారని అభినందించారు. పదేళ్ల బిజెపి హయాంలో ప్రజలపై భారాలు పడ్డాయని, వ్యవసాయం సంక్షోభంలో పడిందని, రైతుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని, అదానీ, అంబానీలకు మోడీ సర్కారు దోచిపెడుతోందని, రాజ్యాంగం, లౌకిక, ప్రజాస్వామ్యం, వ్యవస్థల విధ్వంసం, ఫెడరలిజంపై, మీడియాపై దాడులు జరుగుతున్నాయని చెప్పారు. ‘చివరికి న్యాయ వ్యవస్థ సైతం వివాదాస్పదమైంది. 370 ఆర్టికల్‌ రద్దుకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సిగ్గుచేటు’ అని ధావలే అన్నారు. వచ్చే ఎన్నికల్లో బిజెపిని, దాని మద్దతుదార్లను ఓడించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రారంభసభ వేదికపై ఎఐకెఎస్‌ ప్రధాన కార్యదర్శి విజ్జూ కృష్ణన్‌, ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా, ఆఫీస్‌ బేరర్లు, నాయకులు ఆశీనులయ్యారు. ఎఐకెఎస్‌ ఉపాధ్యక్షులు ఎం.విజయకుమార్‌ సంతాప తీర్మానం ప్రతిపాదించారు.

➡️