9న వికలాంగుల ‘చలో అమరావతి’

Feb 21,2024 10:53 #Manda Krishna Madiga

పింఛను రూ.6 వేలకు పెంచాలి : మంద కృష్ణ మాదిగ

ప్రజాశక్తి- గుంటూరు జిల్లా ప్రతినిధివికలాంగుల సమస్యలపై వచ్చే నెల 9న చలో అమరావతి నిర్వహిస్తున్నట్టు ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపకులు, వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తెలిపారు. గుంటూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వికలాంగులకు తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఎపిలో కూడా పింఛను రూ.6 వేలకు పెంచాలని కోరారు. వికలాంగుల సమస్యలపై సిఎం జగన్‌ స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 2018లో తెలంగాణ ప్రభుత్వం రూ.3 వేలకు పింఛను పెంచగా, ఎపిలో కూడా వైసిపి ప్రభుత్వం రూ.3 వేలు చేసిందని గుర్తు చేశారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పింఛనును రూ.6 వేల పెంచేందుకు హామీ ఇచ్చిందని, ఈ మేరకు వచ్చే ఏప్రిల్‌ నుంచి పెంచేందుకు సన్నాహాలు చేస్తోందని తెలిపారు. జగన్‌ కూడా ఏప్రిల్‌ నుంచి పెంచాలని కోరారు. కొత్త జిల్లాల్లో వికలాంగుల సంక్షేమ కార్యాలయాలు ఏర్పాటు చేయాలని, భార్య, భర్తలు ఇద్దరూ వికలాంగులైతే ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. వికలాంగుల పింఛన్ల తొలగింపులో నిబంధనలు తొలగించాలని, సదరం సర్టిఫికెట్‌ ఉన్న వికలాంగులకు కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించాలని, వికలాంగులకు ప్రయివేటు సంస్థల్లో కూడా ఐదు శాతం రిజర్వేషను అమలు చేయాలని, స్వయం ఉపాధికి రూ.15 లక్షల వరకు రుణం ఇవ్వాలని కోరారు. వికలాంగుల హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్‌, కోర్‌ కమిటీ చైర్మన్‌ అందే రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

➡️