గానకోకిల సుశీలకు పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారం

  •  మణిశర్మ, వి.సుబ్రమణ్యంలకు సత్కారం

ప్రజాశక్తి- విజయనగరం కోట :  ప్రముఖ సినీ సంగీత నేపథ్య గాయని, గానకోకిల, పద్మభూషణ్‌ డాక్టర్‌ పి.సుశీలకు విజయనగరానికి చెందిన శ్రీ గురు నారాయణ కళా పీఠం ఆధ్వర్యాన పరిపూర్ణ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. సోమవారం రాత్రి విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో గురు నారాయణ కళాపీఠం తృతీయ వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సుశీలను సత్కరించి పురస్కారాన్ని అందజేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ, అలనాటి లవకుశ సినిమాలో కుశుడు పాత్ర పోషించిన వి.సుబ్రమణ్యంలకు ఆత్మీయ సన్మానం చేశారు. సుశీల మాట్లాడుతూ చాలా కాలం తరువాత సొంతూరు విజయనగరం రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. తాను నడయాడిన నేలలో అడుగుపెట్టడం ఎంతో అనుభూతికి గురయ్యాయని తెలిపారు. సంగీతం పట్ల ప్రతి ఒక్కరూ మక్కువ పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా లవకుశ సినిమాలోని పాట పాడి అందరినీ అలరించారు. నగర డిప్యూటీ మేయర్‌ కోలగట్ల శ్రావణి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలన్నారు.

➡️