తిరుమలకు పోటెత్తిన యాత్రికులు

ప్రజాశక్తి – తిరుమల :వైకుంఠ ఏకదాశి సందర్భంగా తిరుమల కొండ యాత్రికులతో పోటెత్తింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ఆలయ తలుపులను తెరిచారు. అనంతరం శ్రీవారికి పూజా కైంకర్యాలు నిర్వహించారు. నిర్దేశించిన సమయం కన్నా 45 నిమిషాల ముందే సర్వదర్శనం, రూ.300 ప్రత్యేక దర్శనాల యాత్రికులను ఆలయంలోకి అనుమతించారు. దాదాపు మూడున్నర గంటల పాటు వివిఐపిలకు దర్శనం కల్పించారు. శ్రీవారి ఆలయాన్ని రకరకాల పుష్పాలతో టిటిడి ఉద్యానశాఖ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. యాత్రికుల తాకిడి దృష్ట్యా సామాన్య భక్తులకు ముందుగానే టిటిడి టోకెన్లు జారీ చేసింది.4,008 మంది ప్రముఖులకు దర్శనంవైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశామని, యాత్రికులందరూ శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నామని టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తెలిపారు. రూ 300 ప్రత్యేక దర్శనం, సర్వదర్శన టికెట్ల స్లాటెడ్‌ దర్శనాలను నిర్దేశించిన సమయం కంటే 45 నిమిషాల ముందే ప్రారంభించామని, తెల్లవారుజామున 1:30 గంటకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాలకు యాత్రికులను అనుమతించామని టిటిడి ఇఒ ధర్మారెడ్డి చెప్పారు. మొత్తం 4008 విఐపి బ్రేక్‌ దర్శన టికెట్లు జారీ చేశామన్నారు. క్యూ లైనులల్లో వచ్చే యాత్రికులకు పాలు, కాఫీ, అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు.శ్రీవారి సేవలో ప్రముఖులుతిరుమల శ్రీవారిని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వి రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార మిశ్రా, సూర్య కాంత్‌, హిమ కోహ్లీ, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రవీంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌. ఎల్‌ భట్టి, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్యామ్‌ సుందర్ర్‌, కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌ థావర్‌ చంద్‌ గెహ్లాట్‌, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి తారాల రాజశేఖర్‌, రాష్ట్ర మంత్రులు, టిడిపి నేతలు సందర్శించుకున్నారు.

➡️