పిన్నెల్లి వరుస దాడులు – టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు

May 22,2024 22:41 #K Atchennaidu, #press meet

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులు వరుసగా దాడులకు పాల్పడుతూనే ఉన్నారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పోలింగ్‌ రోజున ఇవిఎంను పిన్నెల్లి బద్దలుకొట్టినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదని అన్నారు. పోలింగ్‌ జరిగిన నాటి నుంచి పల్నాడు జిల్లాలో అల్లర్లు, అరాచకాలు పెద్దయెత్తున చోటుచేసుకున్నాయన్నారు. ఈ ఘటనలపై ఎన్నికల కమిషన్‌, పోలీస్‌ వ్యవస్థ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
అమాయకులపై అక్రమ కేసులు
తాడిపత్రిలో జరిగిన అల్లర్లలో సంబంధం లేని వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని టిడిపి నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, దీపక్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాను సచివాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. తాడిపత్రిలో టిడిపికి చెందిన వారినే ఎక్కువ మందిని కేసుల్లో ఇరికించారని అన్నారు. పెద్దారెడ్డి, ఆయన కుమారుడు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. 728 మంది నిందితుల్లో ఎక్కువ తమ పార్టీకి చెందిన వారినే చూపిస్తున్నారని పేర్కొన్నారు. కౌంటింగ్‌ రోజున మళ్లీ అరాచకాలు సృష్టించేందుకు పావులు కదుపుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించి అమాయకులను ఇరికించొద్దని కోరారు. ఇవిఎం ధ్వంసం ఘటనపై పిన్నెల్లిని తక్షణమే అరెస్టు చేయాలని డిజిపి హరీష్‌ కుమార్‌ గుప్తాను టిడిపి నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఎఎస్‌ రామకృష్ణ కలిసి వినతిపత్రం అందజేశారు. చంద్రగిరిలో పులివర్తి నానిని అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చి కుట్ర చేసిన చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, ఆయన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆదేశాలతో జెసి దివాకర్‌ రెడ్డి నివాసంపై దాడి చేసిన డిఎస్‌పి చైతన్యను అరెస్టు చేయాలన్నారు.

➡️