ప్రజలపై పోలవరం సెస్‌

May 1,2024 00:49 #JanaSena, #pavan kalyan, #polavaram
  • రూ.33 వేల కోట్లు వసూలు చేస్తాం
  •  కొయ్యలగూడెం సభలో పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి- టి.నరసాపురం, కొయ్యలగూడెం : టిడిపి, జనసేన, బిజెపి కూటమి ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర ప్రజలపై పోలవరం సెస్‌ విధిస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో మంగళవారం నిర్వహించిన వారాహి యాత్రలో పవన్‌ మాట్లాడుతూ రూ.33 వేల కోట్లను ప్రజల నుంచి వసూలు చేస్తామన్నారు. ఆ మొత్తంతో పోలవరం నిర్వాసితులకు ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఇస్తామని తెలిపారు. ఇందుకోసం తాను కూడా రూ.కోటి విరాళమిస్తానని చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో పేర్కొన్నందున పూర్తి వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలి. కానీ, పవన్‌ కల్యాణ్‌ ఆ బాధ్యతను తప్పించి, అంతా రాష్ట్రం నెత్తిన రుద్దుతున్నారని పరిశీలకులు అంటున్నారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించే బాధ్యత జనసేన తీసుకుంటుందని, 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని తెలిపారు. 2018 నాటికి టిడిపి ప్రభుత్వ హయాంలోనే 50 శాతం పోలవరం పనులు పూర్తయ్యాయని తెలిపారు. జగన్‌ అధికారం చేపట్టాక ప్రాజెక్టును ముందుకు సాగనివ్వలేదని విమర్శించారు. ముంపు గ్రామాల్లో లక్షా అరవై వేల మంది నిర్వాసితులను గుర్తిస్తే ఏడు వేల మందిని మాత్రమే పునరావాసాలకు తరలించారని, మిగిలిన వారు చెట్టుకొకరు పుట్టకొకరయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా పునర్విభజన సమయంలో పోలవరాన్ని జిల్లా కేంద్రంగా మార్చే విధంగా చంద్రబాబుతో మాట్లాడి ప్రణాళికలు చేపడతామన్నారు. జనసేన పోలవరం అభ్యర్థి చిర్రి బాలరాజు, ఏలూరు టిడిపి ఎంపి అభ్యర్థి పుట్టా మహేష్‌ యాదవ్‌లను గెలిపించాలని కోరారు. ఈ సభలో చింతలపూడి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సొంగా రోషన్‌ కుమార్‌, టిడిపి పోలవరం నియోజకవర్గ కన్వీనర్‌ బొరగం, శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు, ఘంటా మురళీరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సభ మధ్యలో పవన్‌ సెక్యూరిటీ బౌన్సర్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో సభలో కలకలం రేగింది. పోలీసులు అప్రమత్తమై సర్దుబాటు చేయడంతో సద్దుమణిగినా సభానంతరం మళ్లీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేయడంతో సమస్య సర్దుమణిగింది. దీంతో, కొద్దిసేపు ట్రాఫిక్‌ స్తంభించింది.

➡️