సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ మార్చాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌

Jan 26,2024 07:48 #cpm v srinivasarao, #press meet

– రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన

– పోరాటాల అణచివేత అప్రజాస్వామికం

ప్రజాశక్తి -అనకాపల్లి ప్రతినిధి: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ను తాజా పర్చాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ప్రజలు, ప్రజా ఉద్యమాల పట్ల ఎలా వ్యవహరించాలో ఆ మాన్యువల్‌లో పొందుపరచాలన్నారు. గురువారం అనకాపల్లిలోని కార్మిక, కర్షక భవన్‌లో సిపిఎం అనకాపల్లి జిల్లా కార్యదర్శి కె.లోకనాథం, కార్యదర్శివర్గ సభ్యులు జి.కోటేశ్వరరావు, మండల కార్యదర్శి గంటా శ్రీరామ్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అత్యవసర పరిస్థితులను తలపించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై మాట్లాడే అవకాశం లేకుండా, సభలు, సమావేశాలు నిర్వహించకుండా విజయవాడలో నిత్యం 144, 30 సెక్షన్లు అమలు చేస్తున్న పోలీసులు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సభలకు మాత్రం వాటిని అనుసరించకపోవడం అన్యాయమన్నారు. పోలీసులపై ఆధారపడి ఉద్యమాలను అణచివేసే ప్రభుత్వాలేవీ నిలువలేదన్నారు. ప్రజలు, ప్రజా ఉద్యమాల గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తే ప్రభుత్వ గొంతును ఎన్నికల్లో ప్రజలు నొక్కుతారని హెచ్చరించారు. అంగన్‌వాడీలు, ఉపాధ్యాయుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు అమానవీయమన్నారు. స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయులకు నోటీసులు ఇవ్వడం అత్యంత అప్రజాస్వామిక చర్యని అన్నారు. గురువారం విజయవాడలో జరిగే ధర్నాకు వెళ్తున్న ఉపాధ్యాయులకు స్కూల్‌ పిల్లల ఎదురుగా పోలీసులు నోలీసులివ్వడం మానవ హక్కుల ఉల్లంఘనని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలను అర్ధరాత్రి మగ పోలీసులు అరెస్టు చేయడం, సిపిఎం రాష్ట్ర కార్యాలయం గేట్‌ దగ్గర బాబూరావును అరెస్టు చేయడం పోలీసుల దుర్నీతికి నిదర్శనమన్నారు. నేరాలను అరికట్టాల్సిన పోలీసులు నేరస్తులుగా మారడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని అన్నారు. డ్వాక్రా గ్రూపుల రుణాలు రద్దు చేయాలి డ్వాక్రా గ్రూపుల రుణాలన్నింటినీ ప్రభుత్వం రద్దు చేయాలని శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. ఆసరా పేరుతో డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం టోకరా పెడుతోందన్నారు. దొడ్డిదారిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరించాలన్న ప్రభుత్వ కుట్రలను ఉద్యోగులు, ప్రజలు ప్రతిఘటిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మూసేసిన మూడు పరిశ్రమలను కేరళలోని సిపిఎం ప్రభుత్వం నడుపుతున్న విషయాన్ని గుర్తుచేశారు రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కలిసొచ్చే లౌకికపార్టీలతో సంప్రదిస్తామన్నారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపిని ఓడించాలని, ఆ పార్టీతో అంటకాగుతున్న వైసిపి, టిడిపి, జనసేనలతో కలిసే సమస్యే లేదని స్పష్టం చేశారు.

➡️