ఫూలే దంపతుల ఆశయాలు స్ఫూర్తిదాయకం

  •  సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు

ప్రజాశక్తి-నెల్లూరు, ప్రకాశం : కులవ్యవస్థను నిర్మూలించేందుకు ఫూలే దంపతులు చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని గురువారం నెల్లూరులోని ఫూలే దంపతుల విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా, ప్రతి ఒక్కరినీ చదివించి తద్వారా సామాజిక విముక్తి సాధించాలన్న లక్ష్యంతో ఫూలే దంపతులు ఎన్నో కష్టాలు, నిర్బంధాలు ఎదుర్కొన్నారని చెప్పారు. అటువంటి వారు నేటికీ ప్రజల మధ్య సజీవంగా ప్రజలు ఇచ్చే నినాదాల రూపంలో ఉన్నారంటే ఆనాడు వారు చేసిన త్యాగాలే కారణమన్నారు. ఆడపిల్లలకు చదువు చెప్పాలని, కుల వివక్షత రూపుమాపాలని వారు ఎన్నో పోరాటాలు చేశారని వివరించారు. ఆ పోరాటాలు రాజ్యాంగ నిర్మాత బి.ఆర్‌ అంబేద్కర్‌కు, కమ్యూనిస్టులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. సిపిఎం తరపున జ్యోతిరావు పూలే, సావిత్రి బాయి పూలేకు జోహారులు అర్పిస్తూ వారి ఆశయాల సాధన కోసం పనిచేస్తామని చెప్పారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వాహనం తనిఖీ
ఎన్నికల తనిఖీలలో భాగంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు వాహనాన్ని గురువారం పోలీసులు తనిఖీ చేశారు. నెల్లూరు నుంచి ప్రకాశం జిల్లా వైపు వస్తున్న ఆయన కారును ప్రకాశం జిల్లా శింగరాయకొండ మండలం, పాత శింగరాయకొండ గ్రామపంచాయతీ పరిధిలోని జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీ చేశారు.

➡️