ఐక్య పోరాటాలతోనే ‘తపాలా’ను కాపాడుకోవాలి

Dec 11,2023 08:16 #Postal workers strike

-ఎన్‌ఎఫ్‌పిఇ గుర్తింపు తొలగింపు అన్యాయం

-సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింగరావు

ప్రజాశక్తి-మార్కాపురం (ప్రకాశం జిల్లా)కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. ఐక్య పోరాటాలతో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రెండ్రోజులు నిర్వహించనున్న అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్‌-సి, (ఎన్‌ఎఫ్‌పిఇ) 40వ ద్వైవార్షిక రాష్ట్ర మహాసభ ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మాధవి గ్రాండ్‌ ఇన్‌ఫంక్షన్‌ హల్‌లో ఇ శంకరనాయుడు అధ్యక్షతన ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ నేటికీ మారుమూల ప్రాంతాలకు సైతం సేవలు అందిస్తున్న తపాలా శాఖను కేంద్రం ప్రయివేటీకరించాలనుకుంటోందన్నారు. ప్రయివేటీకరణ ఆలోచనను గతంలో ఎన్‌ఎఫ్‌పిఇ పోరాటాలతో అడ్డుకుందని గుర్తుచేశారు. మళ్లీ అదే ప్రయత్నంలో ప్రధాని మోడీ ఉన్నారని తెలిపారు. తపాలా శాఖ ప్రయివేటీకరణను ప్రజా ఉద్యమంతో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తపాలా శాఖలో రూ. ఐదు లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలే ఎక్కువగా దాచుకుంటారని తెలిపారు. తపాలా శాఖ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ప్రయివేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహలు చేస్తోందని విమర్శించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి మాట్లాడుతూ తపాలా శాఖలో తమతో ఏదైనా సమస్య తీరుతుందనుకుంటే సహకరిస్తామన్నారు. అనంతరం ఎన్‌ఎఫ్‌పిఇ ప్రతినిధులు, నాయకులు, తపాలా ఉద్యోగులు వందలాదిగా మార్కాపురం పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం గ్రూప్‌-సి కేంద్ర సంఘం నాయకులు శ్రావణ్‌ కుమార్‌, ఆర్‌ఎన్‌ శరత్‌కుమార్‌, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం పోస్టుమేన్‌ అండ్‌ ఎంటిఎస్‌ కేంద్ర సంఘ కార్యదర్శి సిహెచ్‌ విద్యాసాగర్‌, అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘం-జిడిఎస్‌ కేంద్ర సంఘ సహాయ కార్యదర్శి ఎం శ్రీనివాసరావు, తెలంగాణా రాష్ట్ర గ్రూప్‌-సి అధ్యక్షులు మహిందర్‌, పోస్టుమేన్‌ అండ్‌ ఎంటిఎస్‌ రాష్ట్ర సంఘ అధ్యక్షులు మురళీ, పోస్టల్‌ అండ్‌ ఆర్‌ఎంఎస్‌ కేంద్ర, రాష్ట్ర సంఘ నాయకులు డి మోహనరావు, కె వెంకటేశ్వర్లు, ఎన్‌ నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️