వివేకా హత్య కేసు విచారణలో సిబిఐపై ఒత్తిడి

  •  నిందితులతో అవినాష్‌కు సంబంధాలు : సునీతా రెడ్డి

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సిబిఐపై ఒత్తిడి ఉందని వివేకా కుమార్తె సునీతా రెడ్డి అన్నారు. న్యాయం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నానని, సిబిఐ చేయాల్సింది ఇంకా చాలా ఉందని ఆమె చెప్పారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. వివేకా హత్యకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, నిందితులతో అవినాష్‌ ఫోన్‌ కాల్స్‌, హత్య జరిగిన రోజు వివేకా ఇంట్లో వీడియోలు ఇతర వివరాలతో ఆమె పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. తాను ప్రదర్శించిన దృశ్యాలు చూస్తే వివేకాది గుండెపోటు అని ఎవరైనా అనుకుంటారా? అని ప్రశ్నించారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలను నిందితులుగా సిబిఐ పేర్కొందని తెలిపారు. ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్‌రెడ్డితో ఎంపి అవినాష్‌రెడ్డికి పరిచయం ఉందని చెప్పారు. అవినాష్‌ మాత్రం వీళ్లెవరో తెలియదని అంటున్నారన్నారు. వివేకానందరెడ్డి బలమైన నాయకుడని, ఆయన స్థాయికి చేరుకోవడం అసాధ్యమని అవినాష్‌ అసూయ పడ్డారని పేర్కొన్నారు. హత్య జరుగుతున్న సమయంలో అవినాష్‌, ఎర్ర గంగిరెడ్డి మధ్య ఫోన్‌ కాల్స్‌ వెళ్లాయని వివరించారు. ఇటీవల వివేకా సోదరి విమలారెడ్డి చేసిన విమర్శలపై సునీత స్పందించారు. విమలమ్మ అన్నపై ఆమె చూపిన ప్రేమ ఇదేనా?అని ప్రశ్నించారు. న్యాయం కోసం తాను సిఎం జగన్‌ సహా ఎవరితోనైనా మాట్లాడేందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. గతంలో కొన్నిసార్లు జగన్‌తో మాట్లాడాననీ ఆ తర్వాత అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని చెప్పారు. ఐదేళ్ల క్రితం తనది ఒంటరి పోరాటమని.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల నుంచి మద్దతు లభిస్తోందని వివరించారు.

➡️