విశాఖపట్నం – పూరి వందేభారత్‌ రైలును ప్రారంభించిన ప్రధాని మోడి

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : విశాఖపట్నం కేంద్రంగా నడిచే విశాఖపట్నం – పూరి వందే భారత్‌ రైల్‌ ను ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం 9:15 గంటలకు అహ్మదాబాద్‌ నుండి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ ప్రారంభ వేడుకలను విశాఖ కేంద్రంగా వాల్తేరు రైల్వే డివిజన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా సికింద్రాబాద్‌ కేంద్రంగా సికింద్రాబాద్‌- విశాఖపట్నం మధ్య నడిచే మరొక రైలు నేటి సాయంత్రం విశాఖకు రానుంది.

ఈ సందర్భంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన వాల్తేరు రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ సౌరవ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ … విశాఖపట్నం – పూరి వందే భారత్‌ రైల్‌ తో పాటు వాల్తేర్‌ డివిజన్‌ లోని కోరాపుట్‌ సెక్షన్‌ లో డుమురిపుట్‌ వద్ద రూ.3.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసిన గూడ్స్‌ షెడ్‌, రూ.123 కోట్ల వ్యయంతో కొత్తవలస – కోరాపుట్‌ డబ్లింగ్‌ లైన్‌ ను, కొత్తవలస – కోరాపుట్‌ సెక్షన్‌ లో బోడ్డవర వద్ద రూ.47 కోట్ల వ్యయంతో నిర్మించి 7.3 కిలోమీటర్ల లైన్‌ను, కోరాపుట్‌- రాయగడ సెక్షన్‌ లో రూ.131 కోట్ల వ్యయం తో నిర్మించిన 14.6 కిలోమీటర్లను డబ్లింగ్‌ లైన్‌ ను, రూ.142 కోట్ల వ్యయంతో 9.2 కిలోమీటర్ల మేర నిర్మించిన విజయనగరం- తిట్లఘర 3వ లైన్‌తో పాటు విజయనగరంలో నూతనంగా నిర్మించిన రైలు కోచ్‌ రెస్టారెంట్‌ ను నేడు మోడీ ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చారని అన్నారు. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన ”వన్‌ స్టేషన్‌ వన్‌ ప్రోడక్ట్‌” స్టాళ్ళ ను దువ్వాడ, సింహాచలం, విశాఖపట్నం, కొత్తవలస, తిలారు, బొబ్బిలి, విజయనగరం, చీపురుపల్లి, అరకు, బొర్ర్ర్రా గృహాలు, పార్వతిపురం, కోరాపుట్‌, జైపూర్‌, రాయగడ రైల్వే స్టేషన్‌ లలో ప్రారంభించారని తెలిపారు. ఈ నూతన వందే భారత్‌ రైలు ఒక ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌, ఏడు చైర్‌ కార్‌ కోచులతో మొత్తం ఎనిమిది బోగీలు కలిగి ఉంటుందని , ఈ రైలు మొత్తం 530 మంది ప్రయాణించేందుకు అవకాశం ఉందని అందులో 52 ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌, ఉండగా 478 సాధారణ చైర్‌ కార్‌ సీటింగ్‌ సౌలభ్యం ఉందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతలు ఎస్‌.వి.సూర్య నారాయణ, కుటికుప్పల సూర్యరావు, డిఆర్‌యుసీసీ సభ్యులు ఎం.శేషగిరి రావు, ఏపీటీడీసీ డివిజనల్‌ టూరిజం మేనేజర్‌ హరిత , ఏడిఆర్‌ఎం (ఆపరేషన్‌) మనోజ్‌ కుమార్‌ సాహూ , పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన వందేభారత్‌ రైల్‌ లో కేంద్రీయ విద్యలయం విద్యార్థులను, మీడియా బృందాన్ని పలాస వరకు తీసుకు వెళ్లి మార్గం మధ్యలో రైల్‌ ప్రత్యేకతలను రైల్వే అధికారులు వివరించారు.

➡️