అమరావతికి ప్రైవేటు పెట్టుబడులు!

Jun 28,2024 00:20 #amaravati, #Private investments

-అమెరికా ఎన్‌ఆర్‌ఐకి బాధ్యతలు?
చర్చలకోసం మంత్రి నారాయణతో కమిటి?
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రైవేటు సంస్థలు, వ్యక్తుల నుండి నిధుల సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే బ్యాంకుల నుండి భారీగా రుణాలు తీసుకుని ఉండటంతో, మళ్లీ వాటినుండే నిధుల సమీకరణ దాదాపుగా సాధ్యం కాదన్న అభిప్రాయం ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దీంతో ప్రత్యామ్నాయంగా ప్రైవేటు పెట్టుబడుల అంశం ముందుకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిధుల సమీకరణలో ఎన్‌ఆర్‌ఐలకు పెద్దపీట వేయనున్నారు. దానిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక అమెరికా ఎన్‌ఆర్‌ఐకి నిధుల సేకరణ బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. అదే సమయంలో సింగపూర్‌, అమెరికాతో పాటు పలు ఇతర దేశాలకు చెందిన సంస్థలతో కూడా చర్చలు జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు రాజధాని ప్రాంతంలో తమ కార్యాలయాలను ప్రారంభించాల్సిందిగా పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలను కోరాలని నిర్ణయించింది. ఈ రెండిటికోసం పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో ఒక కమిటీని సాధ్యమైనంత త్వరగా ఏర్పాటు చేయనున్నారు. గతంలోనే అమరావతిలో ఎపిఎన్‌ఆర్‌టి భవనానికి రాయపూడి వద్ద చంద్రబాబునాయుడు స్థలం కేటాయించారు. దాని ద్వారా కూడా ఇప్పుడు నిధుల సేకరణపై దృష్టి సారించినట్లు తెలిసింది.పెట్టుబడులకు సంబంధించిన కంపెనీల వివరాలను ఇప్పటికే సిఆర్‌డిఏ సిద్ధం చేసింది. ఆయా సంస్థలతో చర్చలు ఎప్పుడు, ఎలా, ఎక్కడ నిర్వహించాలనే అంశంపై ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రాజధాని ప్రాంతంలో పస్తుతం ఉన్న పరిస్థితులపై మరో పదిరోజుల్లో సిఆర్‌డిఏ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం నిధుల కోసం వేట ప్రారంభించనున్నట్లు తెలిసింది. అమరావతి రాజధాని ప్రాజెక్టుకు కనీసం రూ.43 వేల కోట్ల అవసరం ఉంది. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికిరూ.15 వేల కోట్ల విలువైన పనులకు టెండర్లకు పిలిచారు. వీటిల్లో దాదాపు తొమ్మిది వేల కోట్ల విలువైన పనులు ప్రారంభమయ్యాయి. కొన్ని పూర్తయ్యాయి. కొన్ని మధ్యలో నిలిచిపోయాయి. ఇప్పుడు అమరావతిలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నా, కొత్త పనులు ప్రారంభించాలన్నా కనీసం రూ.10 వేల కోట్ల అవసరం ఉంటుందని భావిస్తున్నారు.
.

➡️