Protest: మద్దతు ధరకై పోరు

Mar 13,2024 09:38 #AIKS, #MSP
Protests in mandal centers tomorrow to give according to C2plus50

సి2ప్లస్‌50 ప్రకారం ఇవ్వాలని రేపు మండల కేంద్రాల్లో నిరసనలు

 రైతు సంఘాల సమన్వయ సమితి 
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సి2ప్లస్‌50 శాతం కలిపి మద్దతు ధరల చట్టం తేవాలని, దేశవ్యాప్తంగా రైతుల పంట రుణాలు రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 14న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించాలని రైతు సంఘాల సమన్వయ సమితి కోరింది. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో రైతు సంఘం సీనియర్‌ నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ.. రైతాంగానికి కేంద్రం రాతపూర్వకంగా ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని అన్నారు. వ్యవసాయ రంగం మొత్తాన్ని అదానీ, అంబానీలకు కట్టబెడుతోందని పేర్కొన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకూ సి2ప్లస్‌ 50 ఇస్తూ చట్టం చేయాలని కోరారు. ఎఐటియుసి నాయకులు ఓబులేసు మాట్లాడుతూ.. ఎన్నో ఏళ్లు పోరాడి సాధించుకున్న కార్మిక సంక్షేమ చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకువచ్చి కార్మిక హక్కులను కేంద్రం హరిస్తోందని, లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలని కోరారు. కనీస వేతనం నెలకు రూ.26 వేలు అమలు చేయాలన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడాన్ని నిలుపుదల చేయాలని, కడపలో ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే నిర్మించాలని డిమాండు చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న బిజెపితో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు జి ఈశ్వరయ్య మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీ చేస్తూ కేరళ తరహాలో ఉపశమన చట్టం చేయాలని కోరారు. ఎరువులపై సబ్సిడీ కోత విధించడం ఆహార భద్రత చట్టం అమలుకు నిధులు తగ్గించి కార్పొరేట్‌ కంపెనీలకు రాయితీలు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులు, నిర్వాసితులకు పూర్తిగా నష్టపరిహారం చెల్లించాలన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని ఉపసంహరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం అధ్యక్షులు వి కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యుత్‌ చట్టసవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని, స్మార్ట్‌మీటర్ల బిగింపు నిలుపుదల చేయాలని కోరారు. మద్దతు ధర వల్ల భారం పడుతుందని కట్టుకథలు చెప్పడం మానుకోవాలని అన్నారు. అది నిజం కాదని ఆర్థికవేత్తలు చెబుతున్నారని పేర్కొన్నారు. జాగృతి రైతు సంఘం ప్రధాన కార్యదర్శి మరీదు ప్రసాద్‌బాబు మాట్లాడుతూ.. ఆహార భద్రత చట్టాన్ని పటిష్టపరచాలని, 60 ఏళ్లు నిండిన పేద రైతులు, వ్యవసాయ కార్మికులకు నెలకు రూ.ఆరు వేలు పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. 540 రైతు సంఘాలతో కూడిన సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ నెల 14న ఢిల్లీలో రామ్‌లీలా మైదానంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో పి జమలయ్య తదితరులు పాల్గొన్నారు.

➡️