సమస్యలపై నిర్లక్ష్యం తగదు

Nov 20,2023 21:52 #Dharna, #municipal workers
  • హామీలు అమలు చేయాల్సిందే
  • పలు జిల్లాల్లో మున్సిపల్‌ కార్మికుల నిరసన దీక్షలు, ర్యాలీ, ధర్నా

ప్రజాశక్తి- యంత్రాంగం : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మున్సిపల్‌ కార్మికులు సోమవారం నిరసన దీక్షల, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ (ఆప్కాస్‌) కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం నెలకు రూ.26 వేలు ఇవ్వాలని, పెరిగిన జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు, ఆ తర్వాత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదన్నారు. విజయనగరం కలెక్టరేట్‌ వద్ద నిరసన దీక్షలను సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కె.సుబ్బరావమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజల ప్రాణాలను కాపాడింది మున్సిపల్‌ కార్మికులేనని గుర్తు చేశారు. ప్రాణాలకు తెగించి ఆ విధమైన కృషి చేయకుంటే ప్రజల పరిస్థితి ఏమౌనో ముఖ్యమంత్రికి తెలియదా? అని ప్రశ్నించారు. మున్సిపల్‌ కార్మికులు ఉద్యోగులని చెప్పి సంక్షేమ పథకాలకు కోత పెట్టారని, ఉద్యోగులకు ఇచ్చే ఒక్క బెనిఫిట్‌ కూడా వీరికి అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. దీక్షలకు ఎపి మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యుఎస్‌.రవికుమార్‌, సిఐటియు, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, శ్రామిక మహిళా సంఘం, కెవిపిఎస్‌, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండలో కార్మికులు నిరసనలు కార్యక్రమం నిర్వహించారు. గ్రేటర్‌ విశాఖ పరిధిలోని భీమిలి, మధురవాడ, జ్ఞానాపురం జోనల్‌ కార్యాలయాలు, శ్రీహరిపురం వార్డు కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా చేశారు. జివిఎంసి అనకాపల్లి జోనల్‌ మస్తర్‌ పాయింట్‌ వద్ద పారిశుధ్య కార్మికులు, కాబ్ల్‌ డైవర్లు నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు మున్సిపల్‌ కార్యాలయాల వద్ద ధర్నా చేశారు. ఏలూరు జిల్లాలో ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద, చింతలపూడి నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతపురంలో మున్సిపల్‌ కార్మికులు పనిముట్లు, చీపుర్లు, పార్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. నెల్లూరులో ప్రతి రోజులాగానే తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు విధులు నిర్వహించిన కార్మికులు అనంతరం కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడ ధర్నా చేశారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో ర్యాలీ, మున్సిపల్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. వైఎస్‌ఆర్‌ జిల్లా కడప, పొద్దుటూరుల్లో నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేశారు.

➡️