పవన్‌ కల్యాణ్‌ను కలిసిన రఘురామ కృష్ణంరాజు

ప్రజాశక్తి-పిఠాపురం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో పవన్‌కల్యాణ్‌ను నరసాపురం ఎంపి, టిడిపి నేత రఘురామకృష్ణంరాజు మంగళవాకం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉగాది సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో ఇల్లు తీసుకుని గృహ ప్రవేశం చేస్తున్న సందర్భంగా ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలియజేసినట్లు తెలిపారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా, చివరకు జగనే ఇక్కడికి వచ్చి బస చేసినా పిఠాపురంలో పవన్‌కల్యాణ్‌దే గెలుపు అని, ఆయన 65 వేల మెజార్టీతో విజయఢంగా మోగిస్తారని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి అరాచకం చేస్తున్న వ్యక్తిని సాగనంపేందుకు కూటమిని ఏర్పాటు చేసిన వ్యక్తి పవన్‌ కల్యాణ్‌ అని కొనియాడారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేస్తానో, ఎమ్మెల్యేగానా, ఎంపిగానా అనేదానిపై మరో 48 గంటల్లో స్పష్టత ఇస్తానన్నారు. తాను ఎక్కడ నుంచి పోటీ చేసినా ప్రచారం చేయాలని పవన్‌ను కోరానన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా క్షేత్రంలో, చట్ట సభల్లో ఉంటానని తెలిపారు.

➡️