ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు

May 10,2024 23:22 #North Coast, #rains

ప్రజాశక్తి – యంత్రాంగం :ఉత్తర కోసాంధ్రలో శుక్రవారం పలు చోట్ల చెదురుమదురు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిశాయి. రెండురోజులపాటు కురుస్తున్న వర్షాలతో జనం ఒకింత ఉపశమనం పొందినా, నగర వీధుల్లోకి భారీకి వర్షపు నీరు చేరడంతో ఇబ్బంది పడ్డారు. రాజమండ్రి, విజయవాడలో భారీ వర్షం కురిసింది. సుమారు గంటపాటు ఏకధాటిగా వర్షం కురవ్వడంతో రహదారులు జలమయమయ్యాయి. విజయవాడలో కాళేశ్వరరావు మార్కెట్‌, ఆర్‌టిసి బస్టాండ్‌, భవానీపురంలోని బ్యాంకు సెంటర్‌ ప్రాంతాలు జలమయమయ్యాయి. అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయ్యాయి. మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణంలోకి వర్షపు నీరు చేరింది. ప్రధాన రహదారిపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలుచోట్ల వర్షం కురిసింది. రాజమహేంద్రవరం రూరల్‌లో భారీ వర్షం కురిసింది. కడియం, ఆలమూరు, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో చెదురుమదురు జల్లులు పడ్డాయి. కాకినాడ జిల్లా జగ్గంపేట, గండేపల్లి, ప్రత్తిపాడు మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అల్లూరి జిల్లాలో పలుచోట్ల చిరుజల్లులు పడ్డాయి.

➡️