షిప్‌యార్డు ప్రయివేటీకరణతో తీవ్ర నష్టం

  •  విశాఖలో విశ్రాంత ఉద్యోగుల నిరసన

ప్రజాశక్తి – గ్రేటర విశాఖ బ్యూరో : షిప్‌యార్డును ప్రయివేటీకరిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అందులోని ఉద్యోగులకు, పెన్షనర్లకు అన్యాయం జరుగుతుందని ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌కె.హుస్సేన్‌ అన్నారు. షిప్‌యార్డు ప్రయివేటీకరణ చర్యలను నిరసిస్తూ మంగళవారం షిప్‌యార్డు ఆవరణలో సంఘం ఆధ్వర్యాన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షిప్‌యార్డు మనుగడ ఐదు ఎఫ్‌ఎస్‌ఎస్‌ల నిర్మాణంలోనే ఉందని, దీన్ని ప్రయివేట్‌వాళ్లకు అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విశ్రాంత ఉద్యోగులను యాజమాన్యం పట్టించుకోవడం లేదన్నారు. హయ్యర్‌ పెన్షన్‌ రాక వేలాది మంది అవస్థలు పడుతున్నారని తెలిపారు. పలువురు పెన్షనర్లు మాట్లాడుతూ.. 1997 నుంచి 2000 వరకూ పిఎఫ్‌ మొత్తానికి షిప్‌యార్డు యాజమాన్యం కోత విధించిందని, దీని వల్ల నాలుగు శాతం నష్టం జరిగిందని తెలిపారు. పిఎఫ్‌, గ్రాట్యుటీ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ మొత్తాలను తక్షణం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. గోవా షిప్‌యార్డులో మాదిరిగా రిటైర్‌మెంట్‌ అయిన వారి కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు అందేలా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని కోరారు. షిప్‌యార్డు బోర్డు ఆఫ్‌ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టారు.
హిందుస్థాన్‌ షిప్‌యార్డుపై నేడు కీలక భేటీ!
విశాఖపట్నం హిందుస్థాన్‌ షిప్‌యార్డు లిమిటెడ్‌ (హెచ్‌ఎస్‌ఎల్‌) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశం బుధవారం జరగనుంది. షిప్‌యార్డు మనుగడకు అతి కీలకమైన సుమారు రూ.19 వేల కోట్ల విలువైన ఫ్లీట్‌ సపోర్టు షిప్‌ (ఎఫ్‌ఎస్‌ఎస్‌)ల నిర్మాణం ఆర్డర్‌ గురించి బోర్డు సమావేశం చర్చిస్తుందా? లేదా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్‌ఎస్‌ఎస్‌ల నిర్మాణం షిప్‌యార్డు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ సంవత్సరాల తరబడి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆర్డర్‌ ఇచ్చినట్టే ఇచ్చి నిర్మాణ పనులను నిలుపుదల చేసిన విషయం తెలిసిందే. ఇటీవలే అదానీ పోర్ట్స్‌కు చెందిన ప్రతినిధి షిప్‌యార్డు పర్యటన చేసి వెళ్లారు. దీనిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా 20న జరగనున్న సిఎస్‌ఆర్‌ కమిటీ, 63వ ఆడిట్‌ కమిటీ, 424వ బోర్డు మీటింగ్‌లో షిప్‌యార్డు చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ హేమంత్‌ ఖత్రీ పలు అంశాలను అడ్రస్‌ చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర సర్కారు ఆదేశాలతో షిప్‌యార్డుకు ఇండిపెండెంట్‌ డైరెక్టర్‌ దేవీప్రసాద్‌ శెట్టి మంగళవారం విచ్చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ జరిగే పలు సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఆయన పర్యటన 21 వరకూ ఉంటుంది. 19, 20, 21 తేదీల్లో షిప్‌యార్డులోని పలు దఫాల భేటీలు జరగనున్నాయి.

➡️