కూటమిలో అలకలు…అసంతృప్తులు

  •  పొత్తుతో టిడిపికి మూడు అసెంబ్లీ, ఎంపీ స్థానం లాస్‌
  •  వైసిపిలో మూడు ఎమ్మెల్యే, ఎంపీ సిట్టింగ్‌ల మార్పు

ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి : అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 2019 ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్‌ సహా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ వైసిపి విజయం సాధించింది. రానున్న ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు చోట్ల కొత్త వారిని వైసిపి బరిలో దించింది. సిట్టింగ్‌ ఎంపీ డాక్టర్‌ సత్యవతిని మార్చి, ఆ స్థానాన్ని రాజకీయ సమీకరణల దృష్ట్యా రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడుకు టికెట్‌ కేటాయించింది. ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న మాడుగుల నుంచి తన కుమార్తె ఈర్లె అనురాధకు టికెట్‌ కేటాయించారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి నియోజకవర్గ టికెట్‌ మలసాల భరత్‌కుమార్‌కు కేటాయించి, గుడివాడను గాజువాక పంపించారు. పాయకరావుపేట వైసిపి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు రాజ్యసభ సభ్యుడు కావడంతో, ఆయన స్థానంలో రాజాం నియోజకవర్గ వైసిపి ఎమ్మెల్యే కంబాల జోగులుకు పాయకరావుపేట టికెట్‌ ఇచ్చింది. యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం, పెందుర్తి నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు బరిలో వున్నారు. యలమంచిలి, మాడుగుల, అనకాపల్లి నియోజకవర్గాల్లో వైసిపికి సానుకూలంగా వుంది. పెందుర్తి, నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేటలో ఇరు పార్టీల అభ్యర్ధుల మధ్య పోటీ తీవ్రంగా వుంటుంది.
రాజీనామాల దాకా..
టిడిపి, జనసేన, బిజెపి కూటమిలో అనకాపల్లి ఎంపీ టికెట్‌ కడపకు చెందిన సిఎం రమేష్‌కు బిజెపి కేటాయించింది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడుచోట్ల జనసేన, నాలుగు స్థానాల్లో టిడిపి అభ్యర్ధులు బరిలో వున్నారు. అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి నియోజకవర్గాల నుంచి జనసేన… నర్సీపట్నం, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట నుంచి టిడిపి అభ్యర్ధులు పోటీలో వున్నారు. జనసేనకు కేటాయించిన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టిడిపి నాయకుల్లో అసంతృప్తులు కొనసాగుతున్నాయి. జనసేనలోకి కొత్తగా వచ్చిన పంచకర్ల రమేష్‌బాబు, కొణతాల రామకృష్ణకు టికెట్‌ ఇచ్చి, ఎంతోకాలంగా పనిచేస్తున్న నాయకులకు టికెట్‌ ఇవ్వకపోవడంపై జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి వుంది. పెందుర్తి నుంచి జనసేన అభ్యర్ధి పంచకర్ల రమేష్‌బాబు పోటీచేయడంతో సీనియర్‌ టిడిపి నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అలిగారు. కొద్దిరోజులుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగావున్నారు. పెందుర్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ శివశంకర్‌కు టికెట్‌ ఇవ్వకుండా, కొత్తగా పార్టీలో చేరిన రమేష్‌బాబుకు టికెట్‌ ఇవ్వడంపై జనసేన కార్యకర్తలు అభ్యంతరం చెబుతున్నారు. అనకాపల్లి జనసేన టికెట్‌ కొణతాల రామకృష్ణకు ఇవ్వడంతో ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఆ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్‌ పరుచూరి భాస్కరరావు మనస్థాపంతో జనసేనకు రాజీనామా చేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ టికెట్‌ కోల్పోయారు. ఎంతో ఆశతో టిడిపిలో చేరిన సీనియర్‌ నాయకుడు దాడి వీరభద్రరావుకు భంగపాటు తప్పలేదు. యలమంచిలి టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ప్రగడ నాగేశ్వరరావుకు ఈ ఎన్నికల్లో అవమానం జరిగింది. ఈ స్థానం నుంచి జనసేన అభ్యర్ధి సుందరపు విజయకుమార్‌ పోటీలో వుండడంతో సుదీర్ఘకాలంగా టిడిపిలో పనిచేస్తున్న నాగేశ్వరరావుకు చివరకు బాధ మిగిలింది. మాడుగుల టిడిపి అభ్యర్ధి పైలా ప్రసాదరావును మార్చే ఆలోచనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వున్నారు. ఈ నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ పివిజి కుమార్‌,మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు టికెట్‌ ఆశించారు. ప్రసాదరావుకు టికెట్‌ ఇవ్వడంపై గవిరెడ్డి అనుయాయల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. తాజా పరిస్థితుల రీత్యా ప్రసాదరావు బదులు గవిరెడ్డిని రంగంలోకి దించితే మంచిదన్న యోచనలో చంద్రబాబు వున్నారు. కాంగ్రెస్‌ నుంచి పాయకరావుపేట, మాడుగుల, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల్లో అభ్యర్ధులు బరిలో వున్నారు.

సిఎం రమేష్‌పై మంత్రి
తనకు 40 శాతం ఓట్లున్న అనకాపల్లి పార్లమెంట్‌ను టిడిపి వదులుకొని, ఒక్క శాతం ఓట్లున్న బిజెపికి కేటాయించింది. కడపకు చెందిన సిఎం రమేష్‌ను బిజెపి ఎంపీ అభ్యర్ధిగా ఇక్కడ నుంచి పోటీలో పెట్టాలన్న చంద్రబాబు వ్యూహం ఫలించింది. బిజెపికి కేటాయించడంతో తన తనయుడు విజయ్ కు టికెట్‌ రాకుండా చేశారన్న అసంతృప్తితో టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు, నర్సీపట్నం టిడిపి అభ్యర్ధి అయ్యన్నపాత్రుడు వున్నారు. సిఎం రమేష్‌ను కూటమి అభ్యర్ధిగా బిజెపి బరిలో దించడంతో, ఆయనను ఢీ కొట్టకలిగిన మంత్రి ముత్యాలనాయుడును ఎంపీ అభ్యర్ధిగా వైసిపి పోటీలో పెట్టింది. ఇండియా ఫోరంలో భాగంగా జిల్లాలో కాంగ్రెస్‌ కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి సమాయత్తమవుతోంది.

➡️