మద్యం అక్రమ రవాణాపై నిఘా

  • వెబ్‌క్యాస్టింగ్‌,జిపిఎస్‌తో అనుసంధానం
  •  ప్రధాన ఎన్నికల అధికారి మీనా ఆదేశాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు వెబ్‌క్యాస్టింగ్‌, జిపిఎస్‌ సాంకేతికత ద్వారా నిఘా పెంచేందుకు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎమ్‌డిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ఆదేశించారు. మద్యం తయారీ సంస్థలు, మద్యం గోడౌన్లలో ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లు, మద్యం తయారీ, నిల్వ చేసేటువంటి కీలక స్థానాల్లో సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలని గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయా సంస్థలు, గోడౌన్లకు వచ్చి వెళ్లే వాహనాలు, మద్యం తరలించే వాహనాలకు జిపిఎస్‌ కనెక్టివిటీని ఏర్పాటు చేయాలన్నారు. తయారీ సంస్థల నుంచి మద్యం షాపులు, బార్లు ఇతర సంస్థలకు సరఫరా చేస్తున్న వాహనాలపై జిపిఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ ప్రక్రియను అంతా వెబ్‌ క్యాస్టింగ్‌ ద్వారా గమనించేలా సిఇఒ కార్యాలయం, జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అనుసంధానం చేయాలన్నారు. ఈ నెల 15లోపు వెబ్‌క్యాస్టింగ్‌, జిపిఎస్‌ ట్రాకింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.
రూ.100 కోట్లకు పైగా నగదు, లిక్కర్‌, డ్రగ్స్‌ జప్తు
ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తరువాత నుంచి రాష్ట్రంలో రూ.100 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్‌, డ్రగ్స్‌ ఇతర వస్తువులను జప్తు చేశామని మీనా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. షెడ్యూల్‌ వచ్చిన 24 గంటల్లోనే రూ.197.66 లక్షల విలువైన వస్తువులను జప్తు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు రూ.2 కోట్ల నగదు, రూ.12 కోట్లు విలువ చేసే 6,14,837.76 లీటర్ల లిక్కర్‌, సుమారు రూ.3 కోట్లు లక్షల విలువైన 11,54,618,90 గ్రాముల ప్రెషస్‌ మెటల్స్‌, రూ.2.42 కోట్లు విలువైన ఫ్రీ బీస్సు (ఉచితాలు), రూ.7 కోట్ల విలువైన 9,84,148 ఇతర వస్తువలను జప్తు చేశామని వివరించారు.

➡️