మహిళలకు రూ.పది లక్షలు వడ్డీ లేని రుణాలు

Apr 23,2024 21:55 #Nara Chandrababu, #speech

– సోలార్‌ విద్యుత్‌ సంస్కరణలు తీసుకొస్తాం
– ప్రజాగళం సభల్లో చంద్రబాబు
ప్రజాశక్తి – యంత్రాంగం :టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు రూ.పది లక్షలు వడ్డీలేని రుణం ఇస్తామని టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీటి సరఫరా చేసేందుకు కృషి చేస్తామన్నారు. సోలార్‌ విద్యుత్‌ సంస్కరణలు తీసుకువస్తామని ప్రకటించారు. వ్యవసాయ పంపుసెట్లకు సోలార్‌ విద్యుత్‌ను అందిస్తామని, మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు అమ్మి అన్నదాతలు ఆదాయం సమకూర్చుకోవచ్చని తెలిపారు. వచ్చే నెల ఒకటో తేదీనే పింఛన్‌ను ఇంటి వద్ద పంపిణీ చేయాలని, శవ రాజకీయాలు చేయొద్దన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం బండపల్లిలో మహిళా ప్రజాగళం, శ్రీకాకుళం జిల్లా పాతపట్నం, ఆమదాలవలసలో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడారు. డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేశామన్నారు. యువత గంజాయికి అలవాటు పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, దీనికి వైసిపి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. మద్యం మత్తులో మహిళలపై దాడులు, వేధింపులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసిపి విముక్త పాలనకు ప్రతి మహిళా కంకణం కట్టుకోవాలని కోరారు. వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని, అన్నదాతలు అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు, పంటలకు బీమా అమలు చేస్తామని, వ్యవసాయాధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని పంట ఖర్చులు తగ్గిస్తామని చెప్పారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత తొమ్మిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారని, గతంలో రూ.200 వస్తే, ప్రస్తుతం రూ.వెయ్యి దాటి వస్తోందని వివరించారు. రాష్ట్రంలో ఈ ఐదేళ్లలో జె-బ్రాండ్‌ మద్యం అమ్మకాలు చేసిన వారి వివరాలు తమ దగ్గర ఉన్నాయని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో పరిపాలన గాడి తప్పిందని, అన్ని వ్యవస్థలను జగన్‌ నాశనం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో వేలాది ఎకరాలను 22-ఎలో పెట్టి ఆక్రమించుకున్నారని, ఇది ఒక పెద్ద కుంభకోణమని ఆరోపించారు. ఉద్యోగులకు పెండింగ్‌ బకాయిలు చెల్లిస్తామని, పెన్షనర్లకు ఒకటో తేదీనే పెన్షన్‌ చెల్లిస్తామని హామీ ఇచ్చారు. జగన్‌మోహన్‌రెడ్డి రివర్స్‌ పిఆర్‌సిని తెచ్చారని, తాము అధికారంలోకి వస్తే పిఆర్‌సిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. తండ్రి ఆస్తిని చెల్లికి అప్పుగా ఇచ్చిన వ్యక్తి మహిళలకు ఇంకేం న్యాయం చేస్తారని జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. సూపర్‌సిక్స్‌ పథకాల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ఉచితంగా ఇస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు, విజయనగరం ఎంపి అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు, గజపతినగరం అసెంబ్లీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు, పాతపట్నం, ఆమదాలవలస అసెంబ్లీ అభ్యర్థులు మామిడి గోవిందరావు, కూన రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️