అనంతపురం సభతో కాంగ్రెస్‌ ఎన్నికల శంఖారావం : సాకే శైలజనాథ్‌

Feb 20,2024 16:36 #AP, #Congress

ప్రజాశక్తి-అనంతపురం : ఈనెల 26న అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల శంఖారావం ప్రారంభించనున్నట్లు ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి, పిసిసి మాజీ అధ్యక్షులు సాకే శైలజనాథ్‌ తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం రాయదుర్గంలోని ఎన్జీవో హౌంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 26న అనంతపురంలో కాంగ్రెస్‌ పార్టీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మాజీ మంత్రి డాక్టర్‌ ఎన్‌ రఘువీరా రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొంటున్నట్లు తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు హంద్రీనీవా పథకం అమలు చేయడంతో పాటు వ్యవసాయ, పశు వైద్య, పాలిటెక్నిక్‌ కళాశాలలు, కస్తూరిబా పాఠశాల, మోడల్‌ పాఠశాల, హాస్టల్లు మొదలైనవి అనేకం అభివృద్ధి ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల అనంతపురంలో జరిగిన వైసిపి సిద్ధం గురించి మాట్లాడుతూ.. వైసిపికి ఎలాంటి అజెండా లేదన్నారు. ఆ పార్టీ ప్రభుత్వం దేనికి సిద్ధం చెప్పాలన్నారు. జిల్లా అభివృద్ధికి వైసిపి చేసిందేమిటో, ఏమి చేస్తారో చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజలకు ఏం కావాలి, ఏం చేయాలి అనే విషయమై వైసిపికి స్పష్టత లేదన్నారు. సీఎం అనంతపురం వచ్చినప్పటికీ కరువు పీడిత జిల్లాకు ఏం చేశారో, ఏం చేస్తామో చెప్పలేదు అన్నారు. కేవలం రాజకీయ ఉపన్యాసం ఇచ్చి వెళ్లారన్నారు. అయితే కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చెప్పడానికే ఈ నెల 26న ఎన్నికల శంఖారావం అనంతపురంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్యమైన అంశాలు, ఎన్నికల అజెండా కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడే ప్రకటించే అవకాశం ఉందన్నారు. దేశ, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్నికలలో అనంతపురం జిల్లాకు మేలు చేసిన వారిని, చేసేవారి గురించి ఆలోచించాలని ప్రజలను కోరుతున్నట్లు చెప్పారు. అధికారపక్షం దిగిపోవడానికి ఇంకా కొద్దిరోజులు సమయం ఉందని, దేనికైనా సిద్ధం అనడంలో ఆశ్చర్యార్థకం ఉందన్నారు. రాయదుర్గం నుండి తాడిపత్రి వరకు వైసిపి ఏం చేసిందో చెప్పి ఎన్నికలకు రావాలని కోరారు. విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామానాయుడు, ఉపాధ్యక్షులు కోరి నాగరాజు, యువజన కాంగ్రెస్‌ తాలూకా అధ్యక్షుడు ఊరు వాకిలి అనిల్‌ కుమార్‌, రాయదుర్గం పట్టణ అధ్యక్షుడు జయన్న తదితరులు పాల్గొన్నారు.

➡️