ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

  • టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ప్రజాశక్తి-మంగళగిరి : రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమవేశంలో మాట్లాడారు. రామయ్య మాట్లాడుతూ.. ”జగన్ తీరు దొంగే దొంగా దొంగా అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఓటమిని జీర్ణించుకోలేక రాష్ట్రంలో రక్త చరిత్రను సృష్టించి ఎలక్షన్ కమిషన్ పై మళ్లీ బురద చల్లేందుకు యత్నిస్తున్నాడు. ఓడిపోతున్నామన్న ఫ్రస్టేషన్ లో జగన్ ప్లాన్ ‘B’తో అరాచకం సృష్టించాడు. రాష్ట్రం పంపిన ప్రతిపాదనల నుండే అధికారులను ఎలక్షన్ కమిషన్ నియమించింది. ఆ అధికారులు సరిగ్గా పనిచేయడంలేదని వారిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది డీజీపీనే. గతంలో 2019న ఒకే రోజు డీజీపీ, చీఫ్ సెక్రటరీ, ఇంటిలిజెన్స్ డీజీతో పాటు పలువురు ఎస్పీలను తొలగిస్తే ఎలక్షన్ కమిషన్ చర్యలు భేష్ అని జగన్  మెచ్చుకున్నది నిజం కాదా?  నేడు అసమర్థ ఆఫీసర్లను తొలగిస్తే ఎన్నికల కమిషనపై జగన్ దాడి చేస్తున్నాడు.  రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ ఆంజనేయులు, కొల్లి రఘురామరెడ్డి, సీఎస్ జవహర్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డి లు పోలింగ్ రోజున ఎక్కడ ఉన్నారు? అందరూ కలిసి జగన్ గెలుపుకు కుట్ర పన్నింది నిజం కాదా? రాష్ట్రంలో రక్తపాతానికి కుట్రలు చేసింది వీరే.. వీరి కాల్ డేటా బయటకు తీస్తే అంతా తెలుస్తుంది.

మాచర్లలో నరమేధానికి కారకులైన ఎమ్మెల్యే రామకృష్ణ ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిలను వెంటనే అరెస్ట్ చేయాలి. అరాచకం సృష్టించి హౌస్ అరెస్ట్ అయిన మాచర్ల ఎమ్మెల్యే అతని సోదరుడు తాడేపల్లి ప్యాలెస్ కు వచ్చి జగన్ సూచనలతో రాష్ట్రం విడిచి పారిపోయారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మెహిత్ రెడ్డిలు హత్యాయత్నం చేశారు. వీరిని వెంటనే అరెస్ట్ చేయాలి. తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డి సృష్టించిన అరాచకం, విధ్వంసానికి అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. రాజంపేట డీఎస్పీ చైతన్య కు తాడిపత్రిలో పని ఏంటి… జేసీ ప్రభాకర్ రెడ్డి ఇళ్లు ద్వంసం చేసి దివ్యాంగుడిపై దాడి చేయడం చాలా బాధాకరం… అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలి.

అధికారాన్ని వదులకోవడం ఇష్టం లేక జగన్ రక్త చరిత్రకు తెరలేపాడు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, అడిషనల్ డీజీపీ సీతారామాంజనేయులు, ఐజీ కొల్లి రఘురామిరెడ్డి పన్నిన కుట్రను సిట్ దర్యాప్తులో వెలికితీసీ హింసకు కారకులైన వైసీపీ నేతలను జైలుకు పంపాలి. గెలుపు కూటమిదే. ప్రజలు అరాచక పాలనను తరమికొట్టేందుకే పోటెత్తి వచ్చి ఓట్లు వేశారని” అన్నారు.

➡️