అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్‌ – చేతగాని సిఎంను ఇంటికి పంపండి

May 11,2024 22:20 #JP Nadda, #speech

– బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా
ప్రజాశక్తి – ఆదోని, తిరుపతి :సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన చేతగాని సిఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఇంటికి సాగనంపాలని బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని, తిరుపతి రోడ్‌షో, సభలో ఆయన ప్రసంగించారు. తిరుపతిలో నడ్డాతో పాటు లోకేష్‌, నాగబాబు పాల్గన్నారు. నడ్డా మాట్లాడుతూ.. సిఎం జగన్‌ విచ్చలవిడిగా అప్పులు చేసి అవినీతి, అక్రమాలకు పాల్పడి రూ.కోట్లు దండుకున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి మళ్లీ సిఎం అయితే రాష్ట్రం మరింత అధోగతి పాలవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఓటుతో జగన్‌కు బుద్ధి చెప్పాలని కోరారు. ల్యాండ్‌, సాండ్‌ మాఫియాలకు వైసిపి ప్రభుత్వం బ్రాండ్‌గా మారిందని విమర్శించారు. తిరుపతిలో ఐటీ సెక్టర్‌ను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వికసిత భారత్‌లో యువత, మహిళలు, రైతులు, ప్రజలు, కార్మికులు, శ్రామికులు స్వశక్తితో అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నారన్నారు. టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ మాట్లాడుతూ.. జగన్‌ అధికారంలోకి వచ్చాక కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్నవాటిని పక్క రాష్ట్రాలకు తరిమేశారని విమర్శించారు. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు తాను పంచాయతీరాజ్‌, ఐటీ శాఖ మంత్రిగా పనిచేశాననీ ఆ సమయంలో ఫాక్స్‌ కాన్‌, సెల్‌కాన్‌, టిసిఎస్‌, జోహౌ లాంటి అనేక పరిశ్రమలు తీసుకు వచ్చి ఒక లక్ష్యంతో పనిచేశామన్నారు. ఐదు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, తిరుపతి కేంద్రంగా 50 వేల మంది యువత ఎలక్ట్రానిక్స్‌ కంపెనీల్లో పనిచేస్తున్నారని వివరించారు. తిరుపతిలో ఎక్కడ చూసినా భూకబ్జాలు, దందాలేనని, భూమన కుటుంబానికి డబ్బులు ఇస్తేగాని ఇక్కడ పని జరగని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. గతంలో ఇసుక ధర రూ.వెయ్యి ఉండేదని , ఇప్పుడేమో రూ. ఐదు వేలు చేశారని విమర్శించారు. జనసేన రాష్ట్రప్రధాన కార్యదర్శి నాగబాబు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రజా ప్రయోజనాల రీత్యా కూటమిగా ఏర్పడ్డ బిజెపి, టిడిపి, జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తిరుపతి మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ప్రసన్న కుమార్‌ రెడ్డి బిజెపిలో చేరగా కండువా కప్పి పార్టీలోకి జెపి నడ్డా ఆహ్వానించారు.

➡️