సముద్రంలో ప్రమాదాలు

– ఒక బోటు దగ్ధం.. మరోబోటు బోల్తా
– సురక్షితంగా బయటపడ్డ మత్స్యకారులు
ప్రజాశక్తి – యంత్రాంగం :వేర్వేరు పడవ ప్రమాదాల్లో 11 మంది మత్స్యకారులు ప్రాణాలతో బయటపడ్డారు. విశాఖలో బోటు దగ్ధమైన ఘటనలో ఏడుగురు, ప్రకాశం జిల్లాలో బోటు బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. బాధితుల కథనం ప్రకారం… విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కాం గ్రామానికి చెందిన గనగళ్ల అప్పయ్యమ్మకు చెందిన బోటులో ఏడుగురు మత్స్యకారులు నెల 15న విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి చేపల వేటకు వెళ్లారు. అనకాపల్లి జిల్లా పూడిమడకకు సమీపంలో బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని గమనించిన మత్స్యకారులు వాసుపల్లి రాజు, వాసుపల్లి అప్పన్న, వాచుపల్లి దాసీలు, వాసుపల్లి అప్పారావు, గనగళ్ల ఎరికొండు, మైలపల్లి ఎర్రయ్య, కనగళ్ల పోలిరాజు బోటు నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నారు. బోటు దగ్ధం కావడంవల్ల రూ.30 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఫిషింగ్‌ హార్బర్‌ మెకానైజ్డ్‌ బోటు ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్‌ మీడియాకు తెలిపారు. సురక్షితంగా బయటపడ్డ మత్స్యకారులకు ఆశ్రయం కల్పించామన్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులు కొండూరి రాములు, చిట్టిబాబు, గోవిందు, కటారివారిపాలెం గ్రామానికి చెందిన కటారి శ్రీను సోమవారం సాయంత్రం బోటులో చేపల వేటకు వెళ్లారు. సముద్రంలో విపరీతమైన గాలులకు ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. మత్స్యకారులు తేరుకునేలోపే వల, ఇంజన్లు, సిలిండర్‌, ఇన్వర్టర్‌, బ్యాటరీ లైట్స్‌, బోటు గల్లంతయ్యాయి. వల మూటలు, ప్లాస్టిక్‌ టిన్నులు, ఐస్‌ బాక్సుల సాయంతో సముద్రంలోనే ఐదు గంటలపాటు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని గడిపారు. అదే సమయంలో కనపర్తి గ్రామానికి చెందిన మేకల బాబు అనే మత్స్యకారుని బోటు అటువైపుగా వెళ్తుండటాన్ని గమనించి పెద్దగా కేకలు వేశారు. గమనించిన బాబు వారి వద్దకు వెళ్లి బోటులో ఎక్కించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున వారంగా ఒడ్డుకు చేరుకున్నారు. వారిని గ్రామస్తులు పరామర్శించారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.6 లక్షలు నష్టం వాటిలినట్లు బాధితులు తెలిపారు.

➡️