వైఎస్‌ఆర్‌ బిడ్డగా పోటీ

Apr 5,2024 22:27 #bus yatra, #Kadapa, #ys sharmila
  •  కడపలో వివేకా హంతకులను ఓడించండి
  •  బస్సు యాత్రలో వైఎస్‌.షర్మిల

ప్రజాశక్తి- కాశినాయన (వైఎస్‌ఆర్‌ జిల్లా) : వైఎస్‌.వివేకానందరెడ్డి హంతకులను ఓడించాల్సిన అవసరం ఉందని పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలు నియోజకవర్గం కాశినాయన మండలం అమగంపల్లెలో శుక్రవారం ఆమె బస్సు యాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి కలసపాడుకు చేరుకుని సెయింట్‌ పాల్‌ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పోరుమామిళ్ల, బి.కోడూరు, బద్వేలు, అట్లూరు మండలాల్లో బస్సు యాత్ర తొలిరోజు సాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ వివేకానందరెడ్డి హంతకులను కాపాడేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తన పదవిని వాడుకుంటున్నారని విమర్శించారు. హంత కులను చట్ట సభలకు వెళ్లనీయకుండా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, హత్యా రాజకీయాలకు స్వస్తి పలకాలన్నా జగన్‌ను ఓడించాలని కోరారు. వైఎస్‌ఆర్‌ బిడ్డగా కడప ఎంపీగా పోటీ చేస్తున్నానని, దీనికి కారణం జగనేనని అన్నారు. బాబాయిని చంపిన హంతకుడుకి మళ్లీ సీటు ఇచ్చారని, హంతకులను కాపాడుతున్నారని విమర్శించారు. న్యాయం ఒకవైపు, అధికారం మరోవైపు ఉందన్నారు. అధర్మం వైపు నిలబడ్డ అవినాష్‌రెడ్డి కావాలో? న్యాయం వైపు నిలబడ్డ వైఎస్‌ షర్మిల కావాలో? ప్రజలు నిర్ణయించుకోవాలని కోరారు.

బిజెపికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిన జగన్‌
ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రాన్ని బిజెపికి తాకట్టుపెట్టారని, విభజన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా లేదు, కడప ఉక్కు పరిశ్రమ కూడా లేదని తెలిపారు. కడప ఉక్కు పరిశ్రమను శంకుస్థాపనల ప్రాజెక్టుగా మార్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్‌ రెండుసార్లు శంకుస్థాపన చేశారే తప్ప, కార్యరూపం దాల్చలేదని తెలిపారు.

వివేకాను చంపిన వారికి, షర్మిలకు మధ్య పోటీ : సునీత
తన తండ్రి, మాజీ మంత్రి వైఎస్‌.వివేకానందరెడ్డిని చంపిన వారికి, షర్మిలకు మధ్య కడప పార్లమెంట్‌ స్థానంలో పోటీ జరుగుతోందని వివేకా కుమార్తె వైఎస్‌.సునీత అన్నారు. షర్మిలను ఎంపీ చేయాలని తన తండ్రి ఎంతగానో తాపత్రయపడ్డారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తన తండ్రిని క్రూరంగా హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పెదనాన్న వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉంటే దీన్ని సహించేవారా? పదవుల కోసం తమ్ముడిని చంపితే చూసి తట్టుకొనేవారా? అని అన్నారు. కడప ఎంపీగా షర్మిలను దీవించి అవినాశ్‌రెడ్డిని ఓడించాలని కోరారు. బస్సు యాత్రలో పిసిసి మీడియా చైర్మన్‌ తులసిరెడ్డి, బద్వేలు కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌డి.విజయజ్యోతి, డిసిసి అధ్యక్షులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌లో చేరిన కేంద్ర మాజీ మంత్రి కృపారాణి
కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె భర్త రామ్మోహనరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అమగంపల్లె వద్ద బస్సు యాత్ర సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి షర్మిల పార్టీలోకి ఆహ్వానించారు. కిల్లి కృపారాణి ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన విషయం విదితమే.

➡️