నడుస్తూ బిడ్డకు జన్మనిచ్చింది…

ప్రజాశక్తి – అనంతగిరి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : డిజిటల్‌ ఇండియా, అన్నింటా దేశం వెలిగిపోతోంది అంటూ పాలకులు గుప్పిస్తున్న ప్రకటనలు ఉత్తిమాటలేనని తేలిపోయే సంఘటన ఇది. నేటికీ గిరి గ్రామాలకు అంబులెన్స్‌ కూడా వెళ్లలేని పరిస్థితిని తేటతెల్లం చేసే విషయమిది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం మారుమూల పెద్దకోట పంచాయతీ చీడివలస గ్రామానికి చెందిన కిల్లో వసంత సోమవారం నడక దారిలోనే బిడ్డను ప్రసవించింది. సోమవారం ఉదయం ఆమెకు పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం గ్రామం నుంచి ఎత్తయిన కొండ కోనలు, అటవీ ప్రాంతాలను దాటుతూ కాలినడకన ఆమెను తరలించసాగారు. మార్గమధ్యలో వసంతకు పురిటి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. మార్గమధ్యంలోనే ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను, బిడ్డను హుకుంపేట మండలం ఉప్ప ప్రభుత్వాసుపత్రికి వైద్యం నిమిత్తం తరలించారు. చీడివలస గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించేందుకు గత ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసింది. కొందరు అధికారులు, గుత్తేదారులు కుమ్మక్కై ఆ నిధులను స్వాహా చేయడంతో పనులు ముందుక సాగలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2017లో రోడ్డు పనులకు రూ.50 లక్షలను, 2023లో సుమారు కోటి రూపాయలను బిటి రోడ్డు నిర్మించేందుకు మంజూరు చేశారని, వాటితో పనులు పూర్తి చేయకుండా అధికారులు, గుత్తేదారులు కాజేశారని సిపిఎం నాయకులు కె.గోవింద్‌, మాజీ ఉపసర్పంచ్‌ కిల్లో నాగేశ్వరరావు తెలిపారు.

 

➡️