ఇళ్ల స్థలాలు.. సాగుభూములకు పట్టాలివ్వండి

Jan 29,2024 21:04 #Dharna, #Vyavasaya Karmika Sangham
  • వ్యకాసం ఆధ్వర్యంలో శ్రీసత్యసాయి కలెక్టరేట్‌ ముట్టడి
  • ఫిబ్రవరి 20లోపు పరిష్కరించకుంటే నిరవధిక దీక్షలు
  • వ్యకాసం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు

ప్రజాశక్తి – పుట్టపర్తి అర్బన్‌ : శ్రీసత్యసాయి జిల్లాలో ఇళ్ల స్థలాలు, నిర్వాసితులకు న్యాయమైన పరిహారం, సాగు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ను పేదలు ముట్టడించారు. సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఈ ఆందోళన చేపట్టారు. సుమారు రెండు గంటలపాటు బైఠాయించి ఆందోళనను చేపట్టారు. అధికారులెవ్వరూ బయటకు రాకపోవడంతో కలెక్టరేట్‌ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ పేదల వద్దకొచ్చి మాట్లాడారు. సమస్యలను పదిరోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీనికి ముందు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ధర్నాలో సంఘం ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. పాలసముద్రం సమీపంలో నాసన్‌, బెల్‌ పరిశ్రమలకు కారుచౌకగా దళితుల భూములను ప్రభుత్వం లాక్కోవడం దుర్మార్గమన్నారు. ఆర్‌ఆర్‌ చట్టం ప్రకారం భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించి, సరైన నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశమిచ్చినా ఉత్తర్వులను అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పేదల అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి జగన్‌హన్‌రెడ్డి ఆచరణలో మాత్రం అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. పేదల పక్షాన పోరాడాల్సిన టిడిపి, జనసేన పార్టీలు ‘రా కదలిరా’ అంటూ అధికారం కోసం ఆర్రులు చాస్తున్నాయే తప్ప పేదల గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇలాంటి పార్టీలు వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. పదిరోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ వచ్చి హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆయనకు అందజేశారు. ఫిబ్రవరి 20 లోపు సమస్యలు పరిష్కరించకుంటే 21 నుంచి నిరవధిక దీక్షలు చేపడతామని వెంకటేశ్వరావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.ఇంతియాజ్‌, వ్యకాసం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దన్న, అధ్యక్షులు ప్రవీణ్‌కుమార్‌తో పాటు హిందూపురం, పాలసముద్రం, చిలమత్తూరు, కొడికొండ చెక్‌పోస్ట్‌ తదితర ప్రాంతాలకు చెందిన పేదలు పాల్గొన్నారు.

➡️