ఎస్మాకు భయపడం 

sindhu on esma on anganwadi workers in ap ycp govt
  • ప్రభుత్వ కుట్రలు, కుతంత్రాలను ఐక్యంగా తిప్పికొట్టాలి
  • ఏలూరులో అంగన్‌వాడీ నిరాహార దీక్షల ప్రారంభంలో ఎఆర్‌ సింధు

ప్రజాశక్తి-యంత్రాంగం : ఎస్మాకు భయపడేది లేదని అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) అఖిల భారత కార్యదర్శి ఎఆర్‌.సింధు తేల్చిచెప్పారు. సమ్మె విచ్ఛిన్నానికి ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలకు దిగినా భయపడకుండా ఐక్యతతో ముందుకు సాగి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. బీహార్‌లో 18 వేల మందిని, హర్యానాలో తొమ్మిది వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినా వెనక్కి తగ్గకుండా హక్కులు సాధించుకునే వరకూ సమ్మె సాగించి విజయం సాధించారని గుర్తు చేశారు. మహారాష్ట్రలోనూ అంగన్‌వాడీలు పోరాడుతున్నారని వివరించారు. అంగన్‌వాడీలకు మద్దతుగా అన్ని రాష్ట్రాల్లోనూ నిరసనలు చేపట్టాలని సిఐటియు పిలుపునిచ్చిందని తెలిపారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద అంగన్‌వాడీల 24 గంటల రిలే నిరాహార దీక్షలను శనివారం ఆమె ప్రారంభించారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి భారతితోపాటు దీక్షలో కూర్చున్న వారందరికీ దండలు వేసిన అనంతరం సింధు మాట్లాడారు. వేతన పెంపు, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ అమలు వంటి హక్కుల సాధనకు జరుగుతున్న ఈ సమ్మె పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కంటే రూ.వెయ్యి అదనంగా ఇస్తామని జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో అంగన్‌వాడీలు ప్రాణాలకు తెగించి పని చేశారని, ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఐసిడిఎస్‌ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిన్నచూపు ఉందని, నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగినా వేతనం పెంపు చేయకపోవడం దారుణమని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ నిర్బంధాలకు భయపడకుండా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

  • జిల్లా కేంద్రాల్లో 24 గంటల దీక్షలు ప్రారంభం
  • రాష్ట్ర వ్యాప్తంగా ఎస్మా జిఒ దహనం

అంగన్‌వాడీలు ఆందోళనను ఉధృతం చేశారు. రాష్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ 24 గంటల దీక్షలు ప్రారంభించారు. డివిజన్‌, మండల కేంద్రాల్లో సమ్మె శిబిరాలు కొనసాగాయి. రాష్ట్ర ప్రభుత్వ ఎస్మాను ప్రయోగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ విడుదల చేసిన జిఒ 2 కాపీలను సమ్మె శిబిరాల వద్ద దగ్ధం చేశారు. ఎస్మా చట్టం ప్రభుత్వోద్యోగులకు వర్తిస్తుందని, గౌరవ వేతనంతో పని చేస్తున్న తమకు వర్తించదని తెలిపారు. కృష్ణా జిల్లా విజయవాడలో రెండో రోజూ దీక్షలు కొనసాగాయి. శనివారం 24 గంటల దీక్షా శిబిరాన్ని ఆలిండియా లాయర్స్‌ అసోసియేషన్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ సుంకర రాజేంద్రప్రసాద్‌తో కూడిన ప్రతినిధుల బృందం ప్రారంభించారు. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి నాగేశ్వరరావు, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ కె.ధనలక్ష్మి, ఐఎఫ్‌టియు రాష్ట్ర కార్యదర్శి పోలారి, ఎఐటియుసి నాయకులు రమేష్‌బాబు, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాభవాని, పిఒడబ్ల్యు నాయకులు దుర్గ, కాంగ్రెస్‌ పార్టీ మహిళా విభాగం కన్వీనర్‌ కృషిబా, విఆర్‌ఎ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.అంజి, ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ మచిలీపట్నం డివిజన్‌ ప్రధాన కార్యదర్శి కిషోర్‌ వారి ప్రతినిధుల బందం, అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) రాష్ట్ర గౌరవాధ్యక్షులు రోజా తదితరులు సందర్శించి మద్దతుగా మాట్లాడారు.

ఎస్మాను ప్రయోగించడాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరులో అంగన్‌వాడీలు ప్రదర్శన, మానవహారం నిర్వహించారు. జిఒ 2 కాపీలను దగ్ధం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌, రాష్ట్ర, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దడాల సుబ్బారావు, వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అంగన్‌వాడీలు ప్రదర్శనగా వెళ్లి ఆర్‌డిఒకు వినతి పత్రం అందజేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌లో అంగన్‌వాడీల సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమ మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ శిబిరాన్ని మాజీ మంత్రి, టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర సందర్శించి మద్దతు తెలిపారు. విశాఖలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లో కలెక్టరేట్ల ఎదుట 24 గంటల రిలే నిరాహార దీక్షలు పట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దీక్షలను పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు ప్రారంభించి ప్రసంగించారు. అమలాపురంలో దీక్షలను పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జెవివి రాష్ట్ర గౌరవాధ్యక్షులు చెరుకూరి స్టాలిన్‌ మద్దతు తెలిపారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజును అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. తమ సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఎస్మా జిఒ కాపీని దహనం చేశారు. నంద్యాల జిల్లా కొత్తపల్లిలో అంగన్‌వాడీలు ఒంటికాలిపై నిలబడి దండం పెడుతూ నిరసన తెలిపారు. తిరుపతి ఐసిడిఎస్‌ ప్రాజెక్టు సిడిపిఒ సుధారాణిని చుట్టుముట్టారు. సమస్యలు పరిష్కరించక పోగా నోటీసులు ఇవ్వడానికి రావడ పట్ల నిలదీశారు. దీంతో, ఆమె వెనుదిగారు. గూడూరు, రేణిగుంట, పిచ్చాటూరు, పుత్తూరు, నాయుడుపేటల్లో జిఒ కాపీలను దహనం చేశారు. నల్ల రిబ్బన్లు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. చిత్తూరు కలెక్టరేట్‌ ఎదుట దీక్షలు చేపట్టారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో సమ్మె శిబిరంలో గొబ్బెమ్మలు పెట్టి రామణాచందనాల పాట పాడుతూ వాటి చుట్టూ అంగన్‌వాడీలు ప్రదర్శన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో రహదారిపై ఆటలాడుతూ, సాలూరులో కేబేజి పూలు పెట్టుకొని నిరసన తెలిపారు. ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో సమ్మె కొనసాగింది.

➡️