సామాజిక న్యాయమే లక్ష్యం : వైఎస్‌ జగన్‌ 

Jan 20,2024 08:42 #CM YS Jagan, #goal, #Social justice
  • విజయవాడలో భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించిన సిఎం
  • అంటరానితనం రూపు మార్చుకుంటోందని వ్యాఖ్య
  • చంద్రబాబు దళితులకు చేసిందిశూన్యమని విమర్శ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సామాజిక న్యాయమే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. విజయవాడ స్వరాజ్‌ మైదానంలో ‘స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌’ పేరిట ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్‌ విగ్రహాన్ని శ్కుక్రవారం ఆయన ఆవిష్కరించారు. 206 అడుగుల ఎత్తుతో నిర్మించిన ఈ భారీ విగ్రహంలో 81 అడుగుల మేర పీఠం ఏర్పాటు చేశారు. అంబేద్కర్‌ కాంస్య విగ్రహం ఎత్తు 125 అడుగులు. ఈ విగ్రహ ఏర్పాటు కోసం 404.35 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసింది. శుక్రవారం జరిగిన ఆవిష్కరణ కార్యక్రమాన్ని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించింది. విగ్రహావిష్కరణకు ముందు సామాజిక సంకల్ప సభ పేరుతో ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో భారీ కార్యక్రమాన్ని నిర్వహించింది. భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజానీకం చేస్తున్న నినాదాల మధ్య ప్రసంగించిన అనంతరం సిఎం జగన్మోహన్‌రెడ్డి స్వరాజ్‌మైదాన్‌కు వెళ్లి అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు సభలో మాట్లాడుతూ తన 56నెలల పాలనలో చేపట్టిన సామాజిక న్యాయ కార్యకలాపాలను వివరించారు. సామాజిక న్యాయానికి పెద్ద పీట వేసినట్లు చెప్పారు. అభివృద్దికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్‌ భావజాలమన్నారు.స్టాట్యూ ఆఫ్‌ లిబర్టీ అంటే అంటే అందరికీ అమెరికా గుర్తొస్తుందని, రానున్న రోజుల్లో స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టీస్‌ అంటే ఇండియాలో విజయవాడ పేరు గుర్తుకువస్తుందని అన్నారు. నేడు విజయవాడను చూస్తుంటే సామాజిక చైతన్యల వాడగా కనిపిస్తోందన్నారు. అనేక సంవత్సరాల భారత సామాజిక , ఆర్ధిక , మహిళా చరిత్రను మార్చిన ఓ సంఘ సంస్కర్త, ఓ మరణంలేని మహానీయుని విగ్రహాన్ని విజయవాడలో ఆవిష్కరించామన్నారు. ఆయన జన్మించిన 133 సంవత్సరాల తర్వాత , మరణించిన 68 సంవత్సరాల తర్వాత ఈ విగ్రహాన్ని స్టాట్యూ ఆఫ్‌ సోషల్‌ జస్టీస్‌-సామాజిక న్యాయ మహాశిల్పం పేరుతో ఏర్పాటు చేసుకుంటున్నట్లు చెప్పారు. అంటరాని తనం నేడు రూపం మార్చుకుంటోందని చెప్పారు వ్యక్తుల్ని భౌతికంగా ముట్టుకోకూడని, దూరం పెట్టడం మాత్రమే అంటరాని తనం కాదని అన్నారు. అంటరాని తనమంటే పేదలు ఏ బడిలో చదువుకుంటున్నారో, ఆ ప్రభుత్వ బడిని పాడుపెట్టడం ( మరమత్తులు చేయకుండా) కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమేనన్నారు. పేద కులాలవారు ఎప్పటికీ తమ పొలాల్లో పనివారుగా ఉండాలని, తమ ఇళ్లలో పనివారుగా తమకు సేవకులుగా ఉండి పోవాలనే ఆలోచనలు కూడా అంటరానితనమేనని సిఎం వెల్లడించారు. పేదలకు గవర్నమెంట్‌ ఆసుపత్రుల్లో ఎక్కడైతే ఉచిత వైద్యం అందుతుందో అటువంటి ఆసుపత్రులు నీరు గార్చడం, పేదలు ఏ బస్సులో ఎక్కుతున్నారో , ఆ ఆర్టీసీని కూడా ప్రైవేటుకు అమ్మేయాలనుకోవడం ఇవన్నీ కూడా రూపం మార్చుకున్న అంటరాని తనమేనని సిఎం వెల్లడించారు. అంబేద్కర్‌ను అంటరాని తనం, ఆధిపత్య భావజాలం మీద తిరుగబాటుగా ఆయన అభివర్ణించారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దళితులకు చేసింది శూన్యమని విమర్శించారు. సెంటు స్థలం కూడా ఇంటి నిర్మాణాలకు ఇవ్వలేదని సిఎం విమర్శించారు. చంద్రబాబు రక్తంలోనే ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీల మీద ఏ కోశాన ప్రేమ లేదన్నారు. ఎస్‌సిల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నోరు పారేసుకున్నారని సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ సిఎంలు రాజన్నందొర, అంజద్‌బాష, తానేటి వనిత, మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్‌, తిరుపతి ఎంపి గురుమూర్తి, సామాజిక న్యాయ సలహాదారులు జూపూడి ప్రభాకర్‌రావు, ఎమ్మెల్సీ మెండితోక అరుణ్‌కుమార్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, మండలి ఛైర్మన్‌ కొయ్యే మోషన్‌రాజు, మంత్రులు బొత్ససత్యనారాయణ, పినిపే విశ్వరూప్‌, రాజ్యాసభ సభ్యులు విజయసాయిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

➡️