త్వరలో ఎస్‌సి, ఎస్‌టి, ముస్లిం డిక్లరేషన్‌

  • వరికి గిట్టుబాటు ధర కల్పిస్తాం
  •  ప్రజాగళం సభలో చంద్రబాబు
  •  కోనసీమను కలహాల సీమగా మార్చారు : పవన్‌ కల్యాణ్‌

ప్రజాశక్తి – అమలాపురం, అంబాజీపేట(డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా) : బిసిల తలరాతలకు మార్చేందుకు డిక్లరేషన్‌ తెచ్చామని, త్వరలోనే ఎస్‌సి, ఎస్‌టి, ముస్లిం డిక్లరేషన్‌ ఉంటుందని టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గోదావరి జిల్లాల్లో దెబ్బతిన్న కొబ్బరి పంటకు పూర్వ వైభవం తెస్తామని, వరికి గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూటమి అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డిఎస్‌సిపైనే చేస్తామని హామీ ఇచ్చారు. డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం, అమలాపురం నియోజకవర్గాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి ఆయన గురువారం రోడ్‌షో, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అంబాజీపేటలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్ల సంక్షోభానికి, సమస్యలకు చెక్‌పెట్టే సమయం వచ్చిందన్నారు. సబ్‌ ప్లాన్‌ కింద ఏడాదికి రూ.30 వేలు చొప్పున ఐదేళ్లలో రూ.1.50 లక్షలు ఖర్చు పెట్టి బిసిలను ఆర్థికంగా ఆదుకుంటామని తెలిపారు. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. బిసిల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని చెప్పారు. వైసిపి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. పోలీసులకు బకాయిపడ్డ నిధులను ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. విశాఖలో ఎస్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌ శంకర్రావు ఆర్థిక ఇబ్బందులతో చనిపోయారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. సామాజిక న్యాయమే తమ అజెండా అని అన్నారు. కోనసీమకు వన్నె తెచ్చిన వ్యక్తి బాలయోగి అని గుర్తు చేశారు. జగన్‌ విధ్వంస పాలనలో ప్రజలు ఎంతో నష్టపోయారని, తనతో సహా అందరూ బాధితులే.అని చెప్పారు. వైసిపి ఐదేళ్ల పాలనలో విద్యుత్‌ ఛార్జీలతో ప్రజల నడ్డి విరిచారని, నిత్యావసర ధరలు పెంచి పేదల పొట్టకొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజం బాగుండాలని కోరుకునే వ్యక్తి పవన్‌కల్యాణ్‌ అని చెప్పారు. నేడు టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేస్తున్నాయని, తమ ముందు నిలబడే దమ్ము జగన్‌కు ఉందా? అని సవాల్‌ విసిరారు. కాపుల్లో కూడా పేదలున్నారని, వారి కోసం ఏడాదికి రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. కాపుల కోసం ఐదేళ్లలో రూ. 10 వేల కోట్లు ఖర్చు పెడతానని ప్రగల్భాలు పలికిన జగన్‌ కనీసం రూ.10 కోట్లు కూడా ఖర్చుపెట్టలేదని విమర్శించారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. ప్రేమ సీమగా ఉన్న కోనసీమనుకలహాల, కొట్లాట సీమగా జగన్‌ మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడబిడ్దలకు రక్షణ కల్పించలేని వైసిపి ప్రభుత్వం అవసరం లేదన్నారు. కోనసీమకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదని సిఎం జగన్‌ను ప్రశ్నించారు. ఈ సభలో టిడిపి పార్లమెంట్‌ అభ్యర్థి జి.హరీష్‌మాథూర్‌, పి.గన్నవరం నియోజకవర్గ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ, అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ టిడిపి అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

➡️