ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులకు జీతాల్లేవు

Dec 9,2023 10:38 #AP Samagra Shiksha Abhiyan

 

4 నెలల నుంచి ఇదే పరిస్థితి

అప్పులతో గడుస్తున్న కుటుంబాలు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పాఠశాల విద్యాశాఖ పరిధిలోని సమగ్ర శిక్షా అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఎ)లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నాలుగు నెలల నుంచి వేతనాలు అందడం లేదు. ఎస్‌ఎస్‌ఎలో సుమారు 25 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కెజిబివి)లలో బోధన, బోధనేతర సిబ్బంది కలిపి సుమారు 11 వేలమంది ఉంటారు. జిల్లా, మండల విద్యాశాఖ అధికారి (ఎంఇఒ) కార్యాలయాల్లో సిఆర్‌పిఎస్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్స్‌, ఎంఐఎస్‌ కో-ఆర్డినేటర్స్‌, మండల స్థాయి అకౌంటెంట్స్‌, మెసెంజర్స్‌, సహిత విద్యారిసోర్స్‌ పర్సన్స్‌, భవిత కేంద్రాల్లో ఫిజియోథెరపిస్టులు, ఆయాలు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆర్ట్‌, క్రాప్ట్‌, పిఇటి పార్ట్‌టైం టీచర్స్‌ తదితర ఉద్యోగులు సుమారు 14 వేల మంది ఉన్నారు. వేతనాలు రాకపోవడంతో ఉద్యోగులు అప్పులు చేస్తున్న పరిస్థితి నెలకొంది. కుటుంబాలు గడవటం కష్టంగా ఉందని, వేతనాలు చెల్లించాలని ఎస్‌ఎస్‌ఎ డైరెక్టరుకు ఎపి సమగ్ర శిక్షా కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నాయకులు ఇటీవల వినతిపత్రం అందజేశారు. అయినప్పటికీ ప్రభుత్వం ఇప్పటివరకూ వేతనాల చెల్లింపుపై నిర్ణయం తీసుకోలేదు. ఎంటిఎస్‌ అమలుపై వెనక్కి..ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైంస్కేల్‌ అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం 4, 24, 40 జిఓలు జారీ చేసింది. అయితే వీటిని అమలు చేయకుండా రద్దు చేసింది. ప్రాజెక్టులో ఉన్న ఉద్యోగులకు ఎంటిఎస్‌ వర్తించదని వెనక్కి తీసుకుంది. ఇచ్చిన జిఓలను ప్రభుత్వం అమలు చేయడం లేదని, కనీసం వేతనాలను సకాలంలో జమచేయడం లేదని ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జెఎసి రాష్ట్ర ఉపాధ్యక్షులు కె విజరు ఆందోళన వ్యక్తం చేశారు. 11న చలో విజయవాడఉద్యోగులను క్రమబద్ధీకరించి వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. దానిని అమలు చేయకపోగా, ఇప్పుడు వేతనా లను కూడా సకాలంలో చెల్లించడం లేదు. వేతనాలు చెల్లించాలనే డిమాండ్‌తో పాటు రెగ్యు లర్‌ చేయాలని, ఇతర సమస్యలపై ఈ నెల 11న చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఎపి ఎస్‌ఎస్‌ఎ కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ జెఎసి అధ్యక్షులు కాంతారావు

➡️