భిక్షాటనతో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల నిరసన

Dec 27,2023 11:16 #begging, #SSA employees protest
  • ఏడవ రోజు కొనసాగిన నిరవధిక సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యల పరిష్కారం కోరుతూ సమగ్ర సర్వశిక్షా అభియాన్‌ ఉద్యోగులు చేపట్టిన సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. భిక్షాటన చేస్తూ, కంచాలు మోగిస్తూ, చెవిలో పువ్వులు పెట్టుకొని, మానవహారం, ర్యాలీలతో నిరసన తెలిపారు. మంగళవారానికి ఏడో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో పలు జిల్లాల్లోని వక్తలు మాట్లాడుతూ నాలుగున్నర సంవత్సరాలు గడిచిన విద్యాశాఖలో పనిచేసే సమగ్ర శిక్ష ఉద్యోగులను పట్టించుకోకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విద్యా కార్యక్రమాలు నిర్వహించడంలో ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు కీలక పాత్ర వహిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కష్టజీవుల సమస్యలను పట్టించుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగులు ధైర్యంగా, ఐక్యంగా పోరాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించకుండా కార్మికుల సమస్యలను త్వరితిగతిన పరిష్కరించి సమ్మె విరమింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల కలెక్టరేట్ల వద్ద సమగ్ర సర్వశిక్ష కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు సమగ్ర శిక్ష ఉద్యోగుల కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు జెఎసి రాష్ట్ర అధ్యక్షులు బి కాంతారావు మద్దతు తెలిపారు. జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద దీక్షలు నిర్వహించారు. ఖాళీ కంచాలను మోగిస్తూ నినాదాలు చేశారు. భిక్షాటన చేపట్టారు. అనకాపల్లిలో ర్యాలీ మానవహారం నిర్వహించారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. సత్యసాయి జిల్లా కేంద్రంలో పుట్టపర్తిలో ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఇంటి వద్ద ధర్నా చేశారు. వీరి ఆందోళనకు పలువురు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు మద్దతు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం డిఇఒ కార్యాలయం ఎదుట నిర్వహించిన శిబిరంలో ఖాళీ కంచాలు మోగిస్తూ నిరసన తెలిపారు. కాకినాడ జిల్లా కాకినాడ డిఇఒ కార్యాలయం వద్ద, కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో డిఇఒ కార్యాలయం వద్ద భిక్షాటన చేశారు. తిరుపతి పాత మున్సిపల్‌ కార్యాలయం, చిత్తూరు కలెక్టరేట్‌ వద్ద సమ్మె శిబిరాలు కొనసాగాయి. శ్రీకాకుళంలో చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట, పల్నాడు జిల్లా నరసరావుపేట ధర్నా చౌక్‌లో సమ్మె శిబిరాలు కొనసాగాయి. కర్నూలులో భిక్షాటన చేశారు. నంద్యాలలో ధర్నా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని కలెక్టరేట్‌ మార్గంలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరాన్ని యుటిఎఫ్‌ నేతలు సందర్శించి సంఘీభావం తెలిపారు. ఏలూరులో భిక్షాటన చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్‌ ఎదుట జోలెపట్టి భిక్షాటన చేస్తూ, అర్థనగ్న ప్రదర్శన, డప్పులు, పాటలతో నిరసన తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలో సమ్మె కొనసాగింది. కృష్ణాజిల్లా మచిలీపట్నంలో ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఎన్‌టిఆర్‌ జిల్లా, విజయవాడలో నిరసనలు కొనసాగుతున్నాయి. బాపట్ల జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద సమ్మె చేస్తున్న సర్వశిక్ష ఉద్యో గులకు యుటిఎఫ్‌ నాయకులు సంఘీ భావం తెలిపారు.

➡️