10న అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ : బొప్పరాజు వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి- గుంటూరుఅవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ ఈ నెల పదిన విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్లు అమరావతి జెఎసి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం ఆయన గుంటూరు రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జిల్లా సమావేశంలోనూ, అనంతరం మీడియానూ మాట్లాడారు. రాష్ట్రంలో సుమారు రెండు లక్షల మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఉన్నారని, వారిలో లక్ష మందినే అప్కాస్‌లో చేర్చారని, మిగిలిన వారినీ చేర్చాలని కోరారు. వేతనాలు పెంచాలని, ఏటా క్రమం తప్పకుండా జీతాల పెంచాలని, మెప్మా, సెర్ప్‌లో మాదిరిగా ఇతర అన్ని శాఖల్లోనూ ఉద్యోగ భద్రత కల్పించాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని తదితర సమస్యలపై మహాసభలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

➡️