అకుంఠిత దీక్షతో ‘ఉక్కు’ ఉద్యమం :సిఐటియు

ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం సుదీర్ఘకాలంగా అకుంఠిత దీక్షతో పోరాటం కొనసాగుతోందని, ఇదొక మహత్తర పోరాటంగా చరిత్రలో నిలిచిపోనుందని సిఐటియు కంచరపాలెం జోన్‌ కార్యదర్శి ఒమ్మి అప్పారావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్షలు సోమవారానికి 1173వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షల్లో సిఐటియు కంచరపాలెం జోన్‌ కార్యకర్తలు కూర్చున్నారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. అనేక పోరాటాలు, త్యాగాలు ఫలితంగా ఏర్పడిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని, దీనిని ప్రయివేటుపరం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్రంలోని టిడిపి, జనసేన ప్రభుత్వంపై ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటీకరిస్తామని కేంద్రం ప్రకటించిన క్షణం నుంచి ఇప్పటి వరకూ వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగాయన్నారు. ప్రజల ఆకాంక్షను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించి, పూర్తి సామర్థ్యంతో ప్లాంట్‌ను నడపాలని కోరారు. దీక్షల్లో సంఘం నాయకులు ఎం.ఈశ్వరరావు, కె.లక్ష్మణరావు, వి.వరప్రసాద్‌, బి.గంగరాజు పాల్గొన్నారు.

➡️