జీతాల కోసం ఉక్కు కార్మికుల ఆందోళన

May 7,2024 23:23 #ukkunagaram, #visakha steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :సకాలంలో జీతాలు చెల్లించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో స్టీల్‌ ఇడి వర్క్స్‌ కార్యాలయం వద్ద మంగళవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. అనంతరం ఇడి వర్క్స్‌ ఇన్‌ఛార్జ్‌ సోబ్దిని కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా స్టీల్‌ప్లాంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గౌరవాధ్యక్షులు జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ..మే ఏడవ తేదీ దాటినా కార్మికులకు జీతాలు చెల్లించకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. కొన్ని మాసాలుగా జీతాలు చెల్లించలేక యాజమాన్యం తీవ్ర జాప్యం ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. దీంతో ఉక్కు కార్మికులు సకాలంలో లోన్‌ బకాయిలు చెల్లించకుండా బ్యాంకుల వద్ద డిఫాల్ట్‌ అవుతున్నారని వివరించారు. యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. సంఘం ప్రధాన కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ.. స్టీల్‌ యాజమాన్యం కావాలనే ఉత్పత్తిని తగ్గించి ఆ నెపం కార్మికులపై నెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఉత్పత్తికి అవసరమైన కోల్‌ను అదానీ గంగవరం పోర్టు నుంచి తేవడంలో స్టీల్‌ యాజమాన్యం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. అదానీ పోర్టు యాజమాన్యం కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తుంటే స్టీల్‌ యాజమాన్యం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు వైటి.దాస్‌, టివికె.రాజు, గంగాధర్‌, ఎంవి.రమణ, బి.మహేష్‌, డి.సత్యనారాయణ, కృష్ణమూర్తి, శ్రీనివాస్‌, పలు విభాగాల కార్మికులు పాల్గొన్నారు.

➡️