వేతనాలు చెల్లించాలని ‘ఉక్కు’ కార్మికుల ధర్నా

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అడ్మిన్‌ బిల్డింగ్‌ వద్ద ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యాన ఉక్కు కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి సిఐటియు సీనియర్‌ నాయకులు ఎన్‌.రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే కుట్రలను కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వేగవంతం చేస్తోందన్నారు. అందులో భాగంగానే కార్మికులకు వేతనాలు చెల్లించకుండా మానసికంగా హింసించాలని చూస్తోందని అన్నారు. ఎన్‌ఎసిఎస్‌ సమావేశంలో పెంచిన వేతనాలను వెంటనే అమలు చేయాలని కోరారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను నాశనం చేయాలని చూస్తే కార్మికులు సహించబోరని హెచ్చరించారు. ప్రాణ త్యాగాలతో ఏర్పడిన విశాఖ ఉక్కు కర్మాగారం జోలికి ఎవ్వరూ రావొద్దని హితవు పలికారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్‌ డి.ఆదినారాయణ మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసినప్పుడే ప్లాంట్‌ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. పోరాట కమిటీ కో – కన్వీనర్‌ జె.అయోధ్యరామ్‌ మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో రాజకీయ పార్టీలు పని చేసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. స్టీల్‌ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. పోరాట కమిటీ చైర్మన్‌ ఎం రాజశేఖర్‌ మాట్లాడుతూ ఐక్య పోరాటాలతోనే ప్లాంట్‌ను రక్షించుకోగలమని తెలిపారు. ధర్నాలో నేతలు యు.రామస్వామి, వైటి.దాస్‌, కెఎస్‌ఎన్‌.రావు, పి.శ్రీనివాసరాజు, గణపతి రెడ్డి పాల్గొన్నారు.

➡️