బిజెపికి మద్దతు మానండి

May 19,2024 23:39 #cpm, #V.Srinivas rao
  •  టిడిపి, వైసిపిలకు శ్రీనివాసరావు హితవు

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : ఎన్నికల వరకూ బిజెపితో రాష్ట్రంలోని టిడిపి, వైసిపి కుమ్మక్కై మతోన్మాద ప్రమాదాన్ని రాష్ట్రానికి తెచ్చాయని శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికల తర్వాతైనా బిజెపికి మద్దతివ్వకుండా లౌకికవాదాన్ని కాపాడేందుకు ముందుకు రావాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడాలని కోరారు. స్మారకోపన్యాసం అనంతరం విశాఖలోని అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడుతూ వైసిపి, టిడిపిలు రాష్ట్రం అశాంతిపాలు కాకుండా చూడాలన్నారు. ఎన్నికలనంతర హింసకు, ప్రజల్లో అభద్రత, అస్థిరతకు ఈ పార్టీల వైఖరులే కారణమని విమర్శించారు. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందని వివరించారు. ఎన్నికల సంఘం కూడా తరుచూ అధికారులను మార్చడంతో వారు ఏమీ చేయలేకపోతున్నారన్నారు. అధికారంలో ఉన్నాం కాబట్టి ఏం చేసినా చెల్లుతుందని వైసిపి… బిజెపి మద్దతుంది కాబట్టి దేనికైనా తెగించి తేల్చుకుంటామన్నట్టుగా టిడిపి నేతలు హింసకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థ, అధికార యంత్రాంగం రెండూ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐఎఎస్‌, ఐపిఎస్‌ల వ్యవస్థ ఒత్తిళ్లకు లొంగకుండా వ్యవహరించాలని కోరారు.
స్టీల్‌ప్లాంట్‌ గొంతు నులిమే కుట్ర
ఉక్కు కార్మికులు వారి జీతాల కోసం స్టీల్‌ సిఎండి ఇంటినే కాదు అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటినైనా ముట్టడిస్తారని వి.శ్రీనివాసరావు అన్నారు. కేంద్రంలోని బిజెపి కావాలనే స్టీల్‌ప్లాంట్‌ను గొంతునులిమి హత్య చేసేందుకు కుట్రలు పన్నుతోందని తెలిపారు. అందుకే ఉద్యోగులకు జీతాలివ్వడం లేదన్నారు. గతంలో లాభాలొచ్చినప్పుడు ఖజానాలో వేసుకున్నారని, ఇప్పుడు నష్టాలు వస్తున్నాయి కాబట్టి చావండి అంటే ఎలా? అని ప్రశ్నించారు. మూడున్నరేళ్లుగా కార్మికవర్గం స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఉధృతంగా పోరాడుతున్నందున మోడీ సర్కారు కక్ష సాధింపునకు పాల్పడుతోందన్నారు. ఇప్పటికే కేంద్రానికి పన్నులు, జిఎస్‌టిల రూపంలో కోట్ల రూపాయలను స్టీల్‌ప్లాంట్‌ కట్టిందని, కనీసం ఆ డబ్బు వెనక్కి ఇచ్చినా కార్మికులకు జీతాలు వస్తాయని వివరించారు.

➡️