ఇండియా వేదిక, కమ్యూనిస్టు పార్టీలను బలపర్చండి

May 13,2024 06:54 #cpm v srinivasarao, #press meet
CPM State Secretary direct question to YCP, TDP, Janasena

-దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడండి
-ప్రజలకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పిలుపు
ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో:ఎన్నికల్లో ఇండియా వేదిక, కమ్యూనిస్టు పార్టీలను బలపరచాలని, దేశ రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఘట్టం చివరి స్థాయికి వచ్చింది. అన్ని పార్టీల మాటలూ, వాగ్దానాలూ, హామీలన్నింటినీ విన్నారు. ఈ రోజు మన రాష్ట్రం భవిష్యత్తు మీరు తీసుకున్న నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రాతినిధ్యంలేని లోటు అసెంబ్లీలో కనిపిస్తోంది. రెండు ప్రధానమైన పార్టీలైన వైసిపి, టిడిపిలు ప్రజా సమస్యలను విస్మరించి ఒకరినొకరిని తిట్టుకుంటూ వచ్చాయి. బూతులు తిట్టుకోవడం లేక రాళ్లు విసురుకునే రాజకీయాల దాకా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఢిల్లీలో మోడీ ప్రభుత్వానికి తాకట్టు పెట్టి వారి పల్లకీ మోస్తూ రాష్ట్ర అభివృద్ధిని దెబ్బకొట్టడంలో ఇద్దరూ ఒకరికొకరు పోటీ పడుతున్నారు. ఈ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలన్నదే వాళ్లకి పోటీ తప్ప, ఆంధ్రప్రదేశ్‌ను ఎలా అభివృద్ధి చేయాలన్నది కాదు. ఈ అసెంబ్లీలో సిపిఎం, సిపిఐ వంటి కమ్యూనిస్టు పార్టీలకు ప్రాతినిధ్యం లభిస్తే పైరెండు ప్రధాన పార్టీల తప్పుడు విధానాలను ఎండగట్టి ప్రజల తరఫున ఒక మంచి ప్రశ్నించే గొంతుకను ఇచ్చిన వారవుతారు. ఈ ఎన్నికల్లో ఆ రకంగా మీరు సరైన నిర్ణయాన్ని తీసుకుని మా అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అరకు పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న అప్పలనర్స మంచి విద్యావంతుడు. పార్లమెంట్‌లో గిరిజన హక్కుల కోసం పోరాడగల దిట్ట. రంపచోడవరం నుంచి లోతా రామారావు, కురుపాం నుంచి మండంగి రమణ, గాజువాక నుంచి మరడాన జగ్గునాయుడు, విజయవాడ సెంట్రల్‌ నుంచి సిహెచ్‌.బాబూరావు, మంగళగిరి నుంచి జన్నా శివశంకరరావు, గన్నవరం నుంచి కె.వెంకటేశ్వరరావు, నెల్లూరు నుంచి మూలం రమేష్‌, పాణ్యం నుంచి గౌస్‌ దేశారు సిపిఎం తరఫున పోటీ చేస్తున్నారు. వారందరికీ అక్కడి ప్రజలు ఓట్లు వేసి అసెంబ్లీలో బలమైనటువంటి ప్రశ్నించే గొంతుకను, ప్రజల తరఫున పోరాడే ధీరులను చట్టసభలకు పంపాలని కోరుతున్నాను. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి సిపిఐ గుంటూరు పార్లమెంట్‌ సహా ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ, తెనాలి నియోజకవర్గంలో సిపిఐ ఎంఎల్‌ లిబరేషన్‌ పోటీ చేస్తున్నాయి. ఆ అభ్యర్థులను ఇండియా వేదిక బలపరుస్తోంది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను బలపర్చాలని ఇండియా వేదిక తరఫున నిర్ణయించాం. ఇండియా వేదికకు విజయం చేకూర్చాలని, తద్వారా దేశ రాజ్యాంగ వ్యవస్థను, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని యావన్మంది రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

➡️