‘ఉక్కు’ ఉద్యమానికి విద్యార్థుల మద్దతు

May 14,2024 23:48 #Dharna, #vizag steel

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటానికి నగరంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు మద్దతు తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకుంటామని వారు నినదించారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారానికి 1188వ రోజుకు చేరాయి. దీక్షల్లో స్టీల్‌ ట్రాఫిక్‌ విభాగానికి సంబంధించిన ఉద్యోగులు కూర్చున్నారు. వారికి ఆదిత్య డిగ్రీ కళాశాల విద్యార్థులు జత కలిశారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిసిహెచ్‌.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ యువత సామాజిక మాద్యమాల ద్వారా స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. విశాఖ ఉక్కు ఉత్తరాంధ్రకు ఎంత అవసరమన్నదానిపై ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లవచ్చని తెలిపారు.

➡️