పాలిసెట్‌ గ్రాండ్‌ టెస్టును సద్వినియోగం చేసుకోండి

Apr 24,2024 08:34 #Entrance Exam, #Polyset-2024

-సాంకేతిక విద్యాశాఖ కమిషనరు నాగరాణి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఏప్రిల్‌ 27న రాష్ట్రంలో పాలిసెట్‌ 2024 ఎంట్రాన్స్‌ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనరు చదలవాడ నాగరాణి వెల్లడించారు. పదోతరగతి తర్వాత ఉజ్వల భవిష్యత్‌, పిన్న వయసులోనే ఉద్యోగ అవకాశాలు పొందటానికి ఉత్తమమైన మార్గం పాలిటెక్నిక్‌ విద్య మాత్రమేనని, పాలిటెక్నిక్‌ విద్య పూర్తయిన వెంటనే సత్వర ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వివిధ పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకున్నామని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్‌-2024 సన్నాహాక, సన్నద్ధత కార్యక్రమంలో భాగంగా పాలిసెట్‌ గ్రాండ్‌ టెస్టును బుధవారం నిర్వహిస్తున్నామని, దీనికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదని ఆమె తెలిపారు. పాలిటెక్నిక్‌లో చేరాలనుకునే ఏ విద్యార్థి అయినా ఈ సదావకాశాన్ని వినియోగించుకుని పరీక్షకు హాజరుకావచ్చని చెప్పారు. పాలిసెట్‌ ప్రవేశ పరీక్షపై పూర్తి అవగాహన ఉండేలా విద్యార్థులకు ఈ గ్రాండ్‌ టెస్టును నిర్వహిస్తున్నామన్నారు. కాగా, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ లెటరేటరీలను ఆధునీకరించామని, ఎన్‌బిఎ గుర్తింపు పొందిన 36 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మరింత మెరుగైన విద్యనందించేందుకు సాంకేతిక విద్యాశాఖ సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

➡️